నాడు గన్‌‌తో, నేడు గన్‌‌మెన్లతో ప్రజా సేవ చేస్తున్న మంత్రి సీతక్క

నాడు గన్‌‌తో, నేడు గన్‌‌మెన్లతో ప్రజా సేవ చేస్తున్న మంత్రి సీతక్క

కొత్తగూడ, వెలుగు  : గతంలో గన్‌‌తో, ఇప్పుడు గన్‌‌మెన్లతో ప్రజాసేవ చేస్తున్నానని మంత్రి సీతక్క చెప్పారు. తన భర్త కుంజ రాము వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్‌‌ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లిలోని ఆయన స్తూపం వద్ద శుక్రవారం నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... తన భర్త ఆశయాలను కొనసాగిస్తున్నానని చెప్పారు. గతంలో రాముతో కలిసి చేసిన పోరాటం ఫలితంగానే ఆదివాసీల హక్కులు, భూములు సాధించుకున్నామని చెప్పారు. బుల్లెట్‌‌ నుంచి బ్యాలెట్‌‌ వరకు వచ్చినప్పటికీ... చివరి వరకు ప్రజల కోసమే ఉంటా, ప్రజల గురించే మాట్లాడుతానన్నారు. అనంతరం అస్నాల శ్రీనివాస్‌‌ రచించిన ‘అడవి దివిటిలు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

అంతకుముందు కొత్తగూడలో సీఎంఆర్‌‌ఎఫ్‌‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీతక్క కుమారుడు, యువజన కాంగ్రెస్‌‌ రాష్ట్ర కార్యదర్శి సూర్య, రూరల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ డైరెక్టర్‌‌ చల్లా నారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, బ్లాక్‌‌ కాంగ్రెస్‌‌ అధ్యక్షుడు మొగిలి, రాజేశ్వర్‌‌రావు, వెల్దండి వేణు తదితరులు పాల్గొన్నారు.