
- రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
- కరీంనగర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
కరీంనగర్, వెలుగు: బతుకమ్మ పండుగ వందల ఏళ్ల నాటి, సంప్రదాయమని, ఈ పండగ మరో వెయ్యేండ్లు వర్ధిల్లాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిభాపూలే మైదానంలో బుధవారం రాత్రి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంబురాలకు సీతక్క, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలంతా ఐక్యంగా, సంతోషంగా ఉండాలన్నారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆచార, సంప్రదాయానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులు చేయాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, మహిళా కమిషన్ రాష్ట్ర చైర్ పర్సన్ నేరెళ్ల శారద, తెలంగాణ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బతుకమ్మ సంబురాల్లో మహిళలతో కలిసి ఆడి పాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు, సీపీ గౌష్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు పాల్గొన్నారు.
ఎరువుల బాధ్యతను మహిళా సంఘాలకే అప్పజెబుతాం : మంత్రులు సీతక్క, పొన్నం
తిమ్మాపూర్, వెలుగు: రానున్న సీజన్లో ఎరువుల సరఫరా బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగిస్తామని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క వెల్లడించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాయన్నారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా ప్రాంగణంలో బ్యూటీషియన్, టైలరింగ్, జ్యూట్ బ్యాగ్, ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్ల అందజేశారు.
అనంతరం పోషణ మాసోత్సవం, బతుకమ్మ ఉత్సవాల్లో మంత్రులు సీతక్క, పొన్నం, ఎమ్మెల్యే కవ్వంపల్లి పాల్గొన్నారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో శిథిలావస్థకు చేరిన మహిళా ప్రాంగణాలు ప్రస్తుతం స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణనిస్తూ కళకళలాడుతున్నాయన్నారు. రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో సీఎం స్వయం ఉపాధి కోసం రూ.27వేల కోట్ల వడ్డీ లేని రుణాలందించినట్లు చెప్పారు. శిథిలావస్థకు చేరిన రాష్ట్రంలోని పది మహిళా ప్రాంగణాలను మళ్లీ శిక్షణకు సిద్ధం చేసి రూ.10 కోట్లు కేటాయించామని తెలిపారు.