మహిళలందరూ డ్వాక్రా సంఘాల్లో చేరాలి... వడ్డీ లేని రుణాలు పొందొచ్చు: మంత్రి సీతక్క

మహిళలందరూ డ్వాక్రా సంఘాల్లో చేరాలి... వడ్డీ లేని రుణాలు పొందొచ్చు: మంత్రి సీతక్క
  • వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వికారాబాద్, వెలుగు: మహిళాభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని చించల్ పేటలో పలు అభివృద్ధి పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి,  చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆమె ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ.15 లక్షలతో అంగన్వాడీ భవనం, రూ.20 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, రూ.20 లక్షలతో పశు వైద్య ఉపకేంద్ర భవనం, రూ.20 లక్షలతో డ్వాక్రా భవనం, రూ.30లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.20 లక్షలతో పీహెచ్​సీ భవనం, రూ.20 లక్షలతో  గ్రామపంచాయతీ  భవనాలను ప్రారంభించారు. 

అలాగే చేవెళ్ల మండలం ముడిమ్యాల నుంచి మల్కాపుర్ వరకు రూ. 3.35 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో మెయిన్ రోడ్డు నుంచి గ్రామానికి రూ.1.30 కోట్లతో  నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.  తర్వాత తంగడపల్లిలో అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో  పాల్గొని పూజలు నిర్వహించారు. అంతకుముందు సీతక్క మాట్లాడుతూ..  మహిళలందరినీ డ్వాక్రా సంఘాల్లో చేర్పించాలని, సంఘాల్లో ఉన్నవారికి వడ్డీ లేని రుణాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. 

ఇప్పటికే మహిళా సంఘాలకు రూ.800  కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మహిళా సంఘం సభ్యురాలు మృతి చెందితే ఆ కుటుంబంను ఆర్థికంగా ఆదుకోవడానికి రూ.10 లక్షలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్డీఓ వాసు చంద్ర, డీఆర్డీఏ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.