ఆత్మగౌరవం గురించి బీఆర్ఎస్సా మాట్లాడేది : మంత్రి సీతక్క

ఆత్మగౌరవం గురించి బీఆర్ఎస్సా మాట్లాడేది : మంత్రి సీతక్క
  • అధికారం పోయాక గుర్తుకొచ్చిందా
  • కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకున్నపుడు, కవిత కాళ్ల దగ్గర కలెక్టర్ కూర్చున్నపుడు ఇదంతా ఏమైంది?
  • ఈవెంట్ సక్సెస్​ అవుతుండడంతో బీఆర్ఎస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నరని ఫైర్

హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ములుగు, రామప్ప దేవాలయ పర్యటనను వివాదాస్పదం చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రతి అంశాన్ని వక్రీకరించడం బీఆర్ఎస్ కు కామన్ అయిందని ఆమె మండిపడ్డారు. ప్రతి చిన్న విషయానికి తెలంగాణ సెంటిమెంటును రుద్ది రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి సూచించారు. హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకున్నారని, కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు. ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు తోక పట్టుకొని తిరిగిన నాయకుడు.. ఎలాంటి సంస్కృతి సంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. 

గిరిజన సంప్రదాయంలో గుళ్లలోకి కాళ్ళు కడుగుకొని వెళ్లడం సంప్రదాయం.. అదే అక్కడ పాటించారని, అందులో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి అందగత్తెల కాళ్లకు నీళ్ళు పోసిందని, దానిని పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం చేసిందని నిస్సిగ్గుగా అబద్దాలు ప్రచారం చేస్తూ బద్నాం చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. “కవితమ్మ కాళ్ల దగ్గర కలెక్టర్ ను కూర్చోబెట్టినప్పుడు.. కలెక్టర్లతో కేసీఆర్ కాళ్లు మొక్కించుకోవటం మీ దురంహకారానికి నిదర్శనం కాదా. ఈ ఘటనల సమయంలో ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా.. దానికి వ్యతిరేకంగానే కదా ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు.

 అధికారం పోయాక ప్రజలు, ఆత్మగౌరవం యాదికొచ్చిందా? తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత మీకుందా? మీ పార్టీ పేరులో నుంచి తెలంగాణనే తీశారు కదా” అని సీతక్క అన్నారు. ఈ మధ్య సబితా ఇంద్రారెడ్డి ములుగు మీద పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆమె మంత్రిగా ఉన్నపుడు ఏం మానవత్వం చూపించిందో అందరికి తెలుసన్నారు. వాస్తవాలు మాట్లాడాలని, అబద్ధాలకు అంబాసిడర్ గా మారొద్దని ఆమెకు సూచించారు.

ప్లే స్కూళ్లకు ధీటుగా అంగన్ వాడీలు

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, మూడేండ్ల నుంచి ఆరేండ్ల పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ‘‘అమ్మ మాట అంగన్వాడీ బాట’’ నినాదంతో క్యాంపెయిన్ చేయాలన్నారు. గురువారం సెక్రటేరియెట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖపై డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ల(డీడబ్ల్యూవో)తో మంత్రి రివ్యూ చేపట్టారు. ప్రైవేట్ ప్లే స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీలను తీర్చిదిద్దాలని, కేంద్రాల్లో మంచి ఫర్నిచర్ ఉందిన, ఆట వస్తువులు, ప్రీ ప్రైమరీ విద్యను, యూనిఫాములను అందిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియచెప్పాలని సూచించారు. 

అక్షరజ్ఞానంతో పాటు వికాసం, ఉల్లాసం, పోషకాహార కేంద్రాలుగా అంగన్వాడీలు ఉన్నాయన్న విషయాన్ని ప్రజలకు తెలియ చెప్పాలన్నారు. ఇవన్ని సరిగా నిర్వహించేలా చూసుకోవాల్సిన బాధ్యత డీడబ్ల్యూవో లదే అని మంత్రి స్పష్టం చేశారు. సరైన వసతులు లేని సెంటర్లను సమీపంలోని ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని, ప్రభుత్వ స్కూళ్లు అందుబాటులో ఉంటే ఆక్కడికి మార్చాలన్నారు. కొత్త అంగన్ వాడీల నిర్మాణం కోసం రూ.12 లక్షలు శాంక్షన్ చేశామని, వెంటనే ఈ పనులు స్టార్ట్ చేయాలని మంత్రి ఆదేశించారు. 500 అంగన్ వాడీలను రెనోవేట్ చేస్తున్నామని, ఇందులో 289 కేంద్రాల పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన వాటి పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రాంచంద్రన్, కమిషనర్ కాంతి వెస్లీ పాల్గొన్నారు.