ఆధునిక వ్యవసాయంతో అధిక లాభాలు సాధించాలి : మంత్రి సీతక్క

ఆధునిక వ్యవసాయంతో అధిక లాభాలు సాధించాలి :  మంత్రి సీతక్క
  •     మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించి అధిక లాభాలు పొందాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) పిలుపునిచ్చారు. గురువారం గోవిందరావుపేట మండలం సోమలగడ్డలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు అవగాహన సదస్సులో పంటల మార్పిడి, సేంద్రియ సాగు, నూతన వంగడాల వినియోగం, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు వంటి అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. 

సంప్రదాయ సాగుతో పాటు ఆధునిక పద్ధతులు అనుసరించి ఉత్పాదకత పెంచుకోవాలని సూచించారు. పంటల మార్పిడి ద్వారా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. రైతు రుణమాఫీ కింద రూ.21 వేల కోట్లు విడుదల చేశామని, రైతు భరోసాతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. ములుగు జిల్లాలో ఆయిల్‌‌‌‌పామ్ సాగు పెరగడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆయిల్‌‌‌‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ సాంకేతికత వినియోగంతో వ్యవసాయ ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పెంచుకోవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ శాస్త్రీయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంలో మెగా రైతు మేళాలు కీలకమన్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన రైతులను సన్మానించారు.

డిజిటల్ మార్కెటింగ్ తో ఆర్థిక సాధికారత.

ములుగు,వెంకటాపూర్,  వెలుగు: ములుగు జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను “మా శక్తి” బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌‌‌‌లో  కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తో కలిసి మహిళా ఉత్పత్తుల “మా శక్తి” బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాలు తయారు చేస్తున్న పసుపు, కారం, ఇప్పపువ్వు ఉత్పత్తులు, హస్తకళలు, పెయింటింగ్స్, బొమ్మలు, టైలరింగ్ ఉత్పత్తులు తదితర వస్తువులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి   “మా శక్తి” బ్రాండ్‌‌‌‌ను రూపొందించినట్లు తెలిపారు.