
- ట్రైబల్స్ కళలను కాపాడుకోవాలి: మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ఆదివాసీల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నదని మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ మూలవాసీ దినోత్సవాన్ని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించారు. ఆది ధ్వని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూలవాసీ ‘ఉరుములు మెరుపులు’ కార్యక్రమానికి మంత్రి సీతక్క చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. ‘‘ఆదివాసీల కళలను కాపాడుకుంటేనే వారి ఉనికి ఉంటుంది.
వీరి మూలాలను పెకిలించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నది. వాటిని సజీవంగా ఉంచేందుకు జయధీర్, తిరుమలరావు లాంటి వారు కృషి చేస్తున్నరు. వివిధ రూపాల్లో ఆదివాసీల జీవన విధానాన్ని విధ్వంసం చేసే కుట్రలు జరుగుతున్నాయి. మా జాతి కళను, సంస్కృతిని కాపాడేందుకు కృషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. ప్రపంచీకరణ తెచ్చిన జీవనశైలి మార్పులతో.. ప్రాచీన కళలకు ఆదరణ తగ్గుతున్నది. సొరకాయను బుర్రగా చేసుకుని అందులో నీళ్లు పోసుకుని నేను అడవికి వెళ్లినప్పుడు తాగేదాన్ని. ఆ నీళ్లు తాగడంతో నేను ఎంతో హెల్దీగా ఉన్న. ఆదివాసీల తిండి సహజత్వంతో కూడుకున్నది. నేచురల్‌గా దొరికే వస్తువుల్లో ఉండే పోషకాలు ఆధునిక వస్తువుల్లో లేవు’’అని సీతక్క అన్నారు.
ఆల్వేస్.. ఓల్డ్ ఈజ్ గోల్డ్
సజ్జలు, కొర్రలు, జొన్న తిన్నప్పుడు అనాగరికులని అవమానించారని మంత్రి సీతక్క అన్నారు. ఇప్పుడు డబ్బున్నోళ్లు ఇవే తింటున్నారని తెలిపారు. ఆల్వేస్.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పేర్కొన్నారు. ‘‘ప్రకృతిని ప్రేమించాలి. విరుద్ధంగా వెళ్తే బలవుతారు. ఆద్య కళ మ్యూజియం కోసం స్థలం కేటాయించాలని కోరుతున్నారు. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. ప్రపంచ ఆదివాసి దినోత్సవం అంటే కేవలం ఉత్సవం, పండుగ కాదు. హక్కులు, ఆదివాసీల జీవితాన్ని పరిరక్షించుకోవడం. మేధావులు, విద్యావేత్తలు ఆదివాసీల తరఫున పోరాడుతున్నారు. ఈ పోరాటంలో అంతిమంగా న్యాయమే గెలుస్తది’’అని సీతక్క అన్నారు.