ఏడాదికి వంద రోజులు పని కల్పిస్తాం : దనసరి సీతక్క

ఏడాదికి వంద రోజులు పని కల్పిస్తాం : దనసరి సీతక్క
  • కేంద్రంలో అధికారంలోకి రాగానే రోజు రూ. 400 ఇస్తం
  • ఉపాధి కూలీలకు మంత్రి సీతక్క హామీ 
  • కమలాపురంలో బిల్ట్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ప్రకటన

మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో పదేండ్లుగా మూతపడ్డ బిల్ట్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని, మహబూబాబాద్ ఎంపీగా బలరాం నాయక్ ని గెలిపించే బాధ్యత నియోజకవర్గ ప్రజలదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి (అనసూయ) సీతక్క అన్నారు. బలరాం నాయక్ ను గెలిపించాలంటూ మంగళవారం ములుగు జిల్లా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ నుంచి ఏటూరునాగారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కులాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలని బీజేపీ చూస్తోందని, మోదీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలను అమ్మే బీజేపీ కావాలా లేక దేశాభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఏడాదికి కేవలం 42 రోజులే పని కల్పిస్తుందని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏడాదికి 100 రోజులు పని కల్పించడంతో పాటు గతంలో మాదిరిగా  పనిముట్లు అందజేస్తామన్నారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ. 400 ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.