
- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరిన మంత్రి శ్రీధర్ బాబు
- నిజామాబాద్‌లో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ పెట్టండి
- రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఫార్మా, వ్యాక్సిన్ల ఎగుమతులే కీలకం
- ముంబైలో నిర్వహించిన సదస్సులో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు.
డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ (టీఐఈఎస్), సంప్రదాయ పరిశ్రమల పునరుద్ధరణకు కేంద్రం చేపట్టిన పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ముంబైలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన నేషనల్ కామర్స్ కౌన్సిల్ మీటింగ్‌లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పీయూష్ గోయల్‌కు రాష్ట్ర అవసరాలపై పలు విజ్ఞప్తులు చేశారు. ‘‘పసుపు రైతులు అధికంగా ఉన్న నిజామాబాద్‌లో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి. దీంతో పసుపు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతది.
సహజసిద్ధమైన రంగులను ఉత్పత్తి చేయొచ్చు. ఖమ్మం లేదా మహబూబాబాద్‌లో మిరపకాయలను ఎండబెట్టే ప్లాంట్ (చిల్లీ డ్రైయింగ్ ప్లాంట్)ను ఏర్పాటు చేస్తే వాటి నాణ్యత పెరుగుతది. రాష్ట్రంలో ఎక్కువగా పండించే సోనా మసూరి బియ్యానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ ఇవ్వండి’’అని శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.
రిఫ్రిజిరేటెడ్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కల్పించండి
సుగంధ ద్రవ్యాల (స్పైసెస్)ను పరీక్షించి వాటి ప్రమాణాలు, నాణ్యతపై సర్టిఫికెట్లను ఇష్యూ చేసేందుకు నిజామాబాద్ లేదా వరంగల్‌లో ఒక టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా పీయూష్ గోయల్‌ను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.
ల్యాబ్ ఏర్పాటుతో కస్టమ్స్ క్లియరెన్స్ సులభతరమవుతుందని వివరించారు. ‘‘పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంచే ఇరేడియేషన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయండి. దాంతో అవి త్వరగా పాడవ్వకుండా వేస్టేజ్ తగ్గుతది.
పాలు, గుడ్లు, కూరగాయలు ఎగుమతి చేసేందుకు రిఫ్రిజిరేటెడ్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కల్పించాలి. కరీంనగర్ లేదా వరంగల్‌లో పారిశ్రామికవాడలు, గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్‌ను ఏర్పాటు చేయాలి’’అని శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.
ఉపాధి అవకాశాలు మెరుగుపడ్తాయ్
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో మెడిసిన్స్, వ్యాక్సిన్లు, కెమికల్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులే కీలకమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయా రంగాలను పటిష్ట పర్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి అని వివరించారు.
బట్టలు, ప్లాస్టిక్స్, పాలిమర్లు, మెడికల్ పరికరాల ఉత్పత్తికి కూడా రాష్ట్ర పారిశ్రామిక వాతావరణం ఎంతో అనుకూలంగా ఉందని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు.
రంగురాళ్లు, రత్నాలు, బంగారు ఆభరణాలు, బొమ్మలు, ఫర్నీచర్, హ్యాండీక్రాఫ్ట్స్ ఎగుమతుల ప్రమోషన్‌కు కూడా తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.