హైదరాబాద్: తెలంగాణ శాసనసభ పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్‌గా అరికపూడి గాంధీ నియామకంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా తప్పుబట్టారు. పీఏసీ చైర్మన్ను రూల్స్ ప్రకారమే నియమించామని ఆయన మీడియాకు వివరించారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని పీఏసీ చైర్మన్ స్వయంగా చెప్పారని మంత్రి గుర్తుచేశారు. బీఆర్ఎస్లో వాళ్లకువాళ్లకు కొట్లాటలుంటే తమకు సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. స్పీకర్ చట్టప్రకారమే ముందుకు పోతున్నారని ఆయన తెలిపారు. స్పీకర్ను అప్రతిష్టపాలు చేసే కుట్రలు చేస్తున్నారని, వ్యవస్థలను గౌరవించేలా బీఆర్ఎస్ నేతలకు దేవుడు మంచిబుద్ధి ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతోందని, పార్లమెంట్ ఎన్నికల్లో జీరో సీట్లిచ్చినా వాళ్లకు బుద్ధి రాలేదని శ్రీధర్ బాబు విమర్శించారు.
ALSO READ | తెలంగాణ ప్రభుత్వ భవిష్యత్ ప్రణాళికలు బాగున్నాయి : ఫైనాన్స్ కమిషన్ చైర్మన్
అధికారం కోల్పోయామన్న బాధతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, పదేళ్లలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చేశారని బీఆర్ఎస్పై మంత్రి నిప్పులు చెరిగారు. వ్యవస్థలను కాలరాసి భట్టి విక్రమార్కకు ఎల్పీ పదవి లేకుండా చేశారని, పీఏసీ పదవి కాంగ్రెస్ పార్టీకి రాకుండా అడ్డుకున్నారని శ్రీధర్ బాబు గుర్తుచేశారు. రాజ్యాంగస్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన వాళ్లే ఇప్పుడు మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.