నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం : మంత్రి శ్రీధర్ బాబు

నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం : మంత్రి శ్రీధర్ బాబు

మంథని, వెలుగు: నూతన ఆవిష్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పరిశ్రమలు, ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మంథని పట్టణంలో ‘మంథని డ్రీమ్ స్టార్ట్’ ఆఫీసులో టీ వర్క్స్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు మైండ్ సెట్ మేకర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇంగ్లీష్ టు తెలుగు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించినట్లుగా పిల్లలు కలలు కని, వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. 

మంథని యువకులు తయారు చేసిన వ్యవసాయ పవర్ ఫీడర్, ఆధునిక హెల్మెట్ తయారీ వంటి ఆవిష్కరణలకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న 20 స్కూళ్లలో డ్రీమ్ స్టార్ట్ రైస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. అనంతరం మంథని పట్టణంలోని పోచమ్మవాడలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అంతకుముందు మంథని జూనియర్ కాలేజీ ఆవరణలో రూ.44 లక్షలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. 

ఆ తర్వాత మంథని మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్ తండ్రి చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో ఆర్డీవో సురేశ్‌‌‌‌‌‌‌‌, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, లీడర్లు కుడుదల వెంకన్న, కొత్త శ్రీనివాస్, ప్రసాద్,  శశిభూషణ్ కాచే పాల్గొన్నారు.