
హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రెండంచుల కత్తిలాంటిదని, దాని వల్ల ఎంత పురోగతి సాధించవచ్చో.. అన్ని సవాళ్లు కూడా ఉంటాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏఐతో ఆర్థికాభివృద్ధి సాధించడం ఒక్కటే తెలంగాణ లక్ష్యం కాదని, ఏఐని విశ్వసనీయ, పారదర్శక, విలువలతో కూడిన టూల్‌గా మార్చాలన్నదే తమ టార్గెట్ అని పేర్కొన్నారు.
అన్ని రంగాల్లోనూ అందరికీ సమాన ఫలాలు పంచి, ఏఐని ప్రజలందరికీ చేరువచేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం రెండోరోజు ఏఐ గ్లోబల్ సమిట్‌లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. పారిశ్రామికాభివృద్ధికి క్షేత్ర స్థాయిలో ఏఐ ఇన్షియేటివ్స్ను అమలు చేసి, సమూలమైన మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ప్రతి పౌరుడికీ దాని ఫలాలు అందినప్పుడే ఏఐతో విజయం సాధించినట్టవుతుందని తెలిపారు.
ట్రిలియన్డాలర్ల ఆర్థిక వ్యవస్థకు వ్యూహాలు
లక్ష కోట్ల డాలర్ల (ట్రిలియన్ డాలర్లు) ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదిగేందుకు మూడు వ్యూహాలను అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ‘‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేసి.. సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్స్, ఆర్థిక రంగాల్లో మరింత వృద్ధిని సాధించేందుకు సరికొత్త ఆవిష్కరణలను తీసుకొస్తాం. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఏఐ ఇన్నొవేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి.. రాష్ట్రంలోని ప్రతి మూలకు ఏఐ ఆధారిత అభివృద్ధిని చేరవేస్తాం.
పట్టణ, గ్రామీణ ప్రాంతాలను ఏకం చేసి, కొత్త అవకాశాలను సృష్టిస్తాం. ఏఐ విశ్వసనీయత: పారదర్శకత, బాధ్యతాయుతమైన, నైతికతతో కూడిన ఏఐని డెవలప్ చేసి, ఏఐ ఆధారిత పాలనను అందించేందుకు సమగ్రమైన విధివిధానాలను రూపొందిస్తాం. బాధ్యతాయుతమైన ఏఐ ఆవిష్కరణలను ప్రమోట్ చేయడం ద్వారా ప్రజల హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
ఏఐ సిటీకి అదో మైలు రాయి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏఐ సిటీలో డబ్ల్యూటీసీ (వరల్డ్ ట్రేడ్ సెంటర్) క్యాంపస్ ఏర్పాటు అత్యంత కీలకమైన మైలు రాయి అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఐటీ ఎగుమతులను 3,200 కోట్ల డాలర్ల నుంచి 20 వేల కోట్ల డాలర్లకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అది జీవం పోస్తుందని చెప్పారు. అంతర్జాతీయస్థాయి భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధిని సాధించాలన్న లక్ష్యంలో తెలంగాణ కమిట్మెంట్కు డబ్ల్యూటీసీతో అగ్రిమెంట్ నిదర్శనమని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ స్థాయి సంస్థలు డిజిటల్ టెక్నాలజీలకు ఐటీ బడ్జెట్‌ను మరింత పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నదని చెప్పారు. రాష్ట్ర ఏఐ ప్రయాణంలో ప్రస్తుతం నిర్వహించిన ఏఐ గ్లోబల్ సమిట్ఓ మైలురాయిలా నిలిచిపోతుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఏఐ ఫలాలు అంది, రాష్ట్ర ఆర్థిక ప్రగతి మరింత ఎత్తుకు ఎదిగేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.