మాది చేతల ప్రభుత్వం.. మాటల ప్రభుత్వం కాదు : మంత్రి శ్రీధర్ బాబు

మాది చేతల ప్రభుత్వం.. మాటల ప్రభుత్వం కాదు : మంత్రి శ్రీధర్ బాబు

ప్రజా పాలనపై తెలంగాణ మంత్రులు జిల్లాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష చేపట్టారు. డిసెంబర్ 28 నుండి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలపై ప్రభుత్వ అధికారుల దగ్గర విజ్ఞప్తులు తెలియజేశామన్నారు రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జి మంత్రి శ్రీధర్ బాబు. ఆరు జోన్లు, 30 సర్కిల్స్ లో ప్రజా పాలన కార్యక్రమం అమలు చేస్తామన్నారు. ప్రజలందరూ ముందుకు వచ్చి తమ సమస్యలపై వినతులు ఇవ్వొచ్చన్నారు. ప్రతి వార్డులో 4 చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, అక్కడ సమస్యలపై విజ్ఞప్తులు తీసుకుంటారని తెలిపారు. ప్రతి టీమ్ కు ఒక్క టీమ్ లీడర్ తో పాటు వారికి అవేర్ నేస్ కోసం 7 మంది సభ్యులు అందుబాటులో ఉంటారని వివరించారు. 

మహిళలకు ప్రత్యేక లైన్ లు ఏర్పాటు చేసి.. వారి విజ్ఞప్తులు తీసుకుంటామన్నారు. అన్ని శాఖలతో కలిసి ప్రజా పాలన కార్యక్రమం అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రతి వార్డ్ కు ఒక్క టైం టేబుల్ ఇచ్చామని, ఏ టైంలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తారో ముందే తెలియజేస్తామన్నారు. 150 వార్డుల్లో డిసెంబర్ 28 నుండి జనవరి  6 వరకు విజ్ఞప్తులు తీసుకుంటామన్నారు. 30 సర్కిల్స్ కు 30 స్పెషల్ ఆఫీసర్లను నియమించామని తెలిపారు. 
అభయ హస్తం అమలు చేయడం తమ ప్రధాన ధ్యేయమని చెప్పారు. 

మాది చేతల ప్రభుత్వం..మాటల ప్రభుత్వం కాదు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే రెండు పథకాలను అమలు చేశామని చెప్పారు. ఇన్నాళ్లు ప్రజా సమస్యలను వినే వారు లేరని చెప్పారు. తాము ప్రజల కోసం పని చేస్తామన్నారు.