కొత్త రేషన్​ కార్డులకు అప్లికేషన్లు తీసుకుంటం:మంత్రి శ్రీధర్ బాబు

కొత్త రేషన్​ కార్డులకు అప్లికేషన్లు తీసుకుంటం:మంత్రి  శ్రీధర్ బాబు
  • ఆరు గ్యారంటీలతోపాటు రెవెన్యూ సమస్యలపైనా 
  • దరఖాస్తులు ఇవ్వొచ్చు: శ్రీధర్​బాబు
  • జనాభా ఎక్కువ ఉన్న చోట రెండు కౌంటర్ల ఏర్పాటు
  •  మాది ప్రజల వద్దకే పాలన: పొన్నం ప్రభాకర్​

ఆదిలాబాద్, వెలుగు: ఈ నెల 28 నుంచి నిర్వహించే ప్రజాపాలన గ్రామ సభల్లో కొత్త రేషన్​కార్డుల అప్లికేషన్లు కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. ‘‘గ్రామ సభల్లో ఆరు గ్యారంటీలతో పాటు రెవెన్యూ, స్థానిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, రేషన్​కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటాం’’ అని అన్నారు. ఎక్కువ జనాభా ఉన్న చోట రెండు కౌంటర్లు కూడా పెట్టాలని, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని మండల ఆఫీసర్లను ఇప్పటికే ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. 

ఈ నెల 28న కాంగ్రెస్​ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా నాగ్​పూర్​లో జరిగే మీటింగ్​కోసం ఆదిలాబాద్​లో సన్నాహక సమావేశం నిర్వహించగా మంత్రులు శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్​హాజరయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్​తో కలిసి శ్రీధర్​బాబు మాట్లాడారు. నాసిరకం ప్రాజెక్టులు కట్టి బీఆర్ఎస్​సర్కారు రాష్ట్ర సంపదను దోచుకుందని, దొంగ లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చామని, మిగిలిన నాలుగింటి అమలు కోసం కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి తెలిపారు. అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ తమ ప్రభుత్వంపై బురదచల్లడం సిగ్గు చేటన్నారు. 

స్వేదపత్రం పేరుతో నాటకాలు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో తాము శ్వేతపత్రం విడుదల చేస్తే  తెల్లముఖాలేసుకున్న బీఆర్ఎస్ నాయకులు.. బయటకొచ్చి స్వేదపత్రం పేరుతో నాటకాలు ఆడుతున్నారని శ్రీధర్​బాబు విమర్శించారు. సర్కార్ ను బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. ‘‘నీటి పారుదల, విద్యుత్ అంశాలపై శ్వేత పత్రాలు చదువుకునేందుకు సమయం కావాలంటే బీఆర్ఎస్ కు సమయం ఇచ్చాం. ఆ తర్వాతే సభా కార్యక్రమాలు మొదలు పెట్టాం. నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆనాటి సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మాకు సమయం కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగితే నిరంకుశంగా మాట్లాడి సమయం ఇవ్వలేదు’’ అని గుర్తు చేశారు. రూ.7 లక్షల కోట్ల వరకు అప్పులు చేసి, ఏ పేద వారికి సంపద సృష్టించారో స్పష్టంగా చెప్పాలని బీఆర్ఎస్​కు సవాల్ విసిరారు. 2 కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ హామీ మరిచిపోయిందన్నారు. ‘హమ్ తయ్యార్ హై’ నినాదంతో ఈ నెల 28న నాగ్ పూర్​లో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.

2 వేల కొత్త బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్

తమది ప్రజల వద్దకే పాలన అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈనెల 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న నాగ్ పూర్ సభకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక నిర్వహించనున్న మొదటి సభ కాబట్టి తెలంగాణ భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఆయన విజ్క్షప్తి చేశారు. 28 నుంచి6వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో ఊరూరా ఆరు గ్యారరెంటీలపై అప్లికేషన్లు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్​ కార్యకర్తలు ప్రభుత్వానికి.. ప్రజలకు వారధిగా ఉండేలా పనిచేయాలని మంత్రి పొన్నం సూచించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు నాలుగు కోట్ల మంది జీరో టికెట్లపై ప్రయాణించారని మంత్రి తెలిపారు. ప్రయాణికులు పెరగడంతో 2 వేల కొత్త బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుచేసేందుకు బీఆర్ఎస్​ ఆటో యూనియన్లను రెచ్చకొడుతోందని మంత్రి పొన్నం ఆరోపించారు.