సౌండ్ కోసం డమ్మీ గన్ పేల్చిన

సౌండ్ కోసం డమ్మీ గన్ పేల్చిన
  • నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు 
  • మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ 

హైదరాబాద్ : ఫ్రీడం వాక్ కార్యక్రమంలో తాను పేల్చిన గన్ లో బుల్లెట్ లేదని, సౌండ్ కోసమే డమ్మీ గన్ పేల్చానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. అచ్చంపేట పట్టణంలో నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తుపాకీ పట్టుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో మంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంత్రి వివరణ ఇచ్చారు. ర్యాలీలు, వాక్ వంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు డమ్మీ గన్ పేల్చడం ఆనవాయితీ అని చెప్పారు. తక్కువ మంది ఉంటే జెండా ఊపి, ఎక్కువ మంది ఉంటే గాలిలో డమ్మీ గన్ తో కాల్పులు జరిపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

ఎవరో గిట్టనివారు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్... ఎస్పీ పేల్చమంటేనే తాను డమ్మీ గన్ తో గాల్లోకి కాల్పులు జరిపినట్లు వివరణ ఇచ్చారు. అంత పెద్ద ర్యాలీ చేపడితే దాని గురించి మాట్లాడకుండా అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. తన ఇమేజీ డ్యామేజ్ చేయడానికి కొంతమంది పనిగట్టుకొని ఇదంతా చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.