ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​

మహబూబ్​నగర్​, వెలుగు : ఎనిమిదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై సాహితీవేత్తలు రచనలు చేయాలని,  రాష్ట్రం నాడు నేడు ఎలా ఉందో  ప్రపంచానికి చాటాలని  పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ సూచించారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్​ కాలేజీలో ఆదివారం ‘పాలమూరు సాహితి’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పురస్కార ప్రదానోత్సవానికి మంత్రి చీఫ్​ గెస్ట్​గా హారయ్యారు. ఈ సందర్భంగా 2020 సంవత్సరానికి గాను ‘కవిత్వమే ఓ గెలాక్సీ’ పుస్తక రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి, 2022 సంవత్సరానికి గాను ‘ప్రాణదీపం’ పుస్తక రచయిత గాజోజు నాగభూషణంలకు పురస్కారాలను అందజేశారు. వెలుదండ వెంకటేశ్వరరావు రచించిన వేంకటేశ శతకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహబూబ్​నగర్ రూరల్ మండలం వెంకటాపూర్ వద్ద కోయిలకొండ ఆర్అండ్​బీ రోడ్డు నుంచి గుట్ట మీది తండా వరకు రూ.1.75 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డుకు భూమి పూజ చేయడంతో ఆపటు రూ.5 లక్షలతో నిర్మించిన వెల్ నెస్ సెంటర్, రూ.13 లక్షలతో వేసిన సీసీ రోడ్డు, రూ.3 లక్షలతో నిర్మించిన  పోచమ్మ గుడి కాంపౌండ్ వాల్, రూ. 4.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఐమాస్ట్ లైట్లను ప్రారంభించారు. మాచన్​పల్లి తండాలో రూ. 3.23 కోట్లతో నిర్మించిన 64 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో లబ్ధిదారులను గృహప్రవేశం చేయించడంతో పాటు  వెంకటాపూర్, రేగడిగడ్డ తండా, మాచన్​పల్లి తండాలో కొత్త పింఛన్‌‌ కార్డులను పంపిణీ చేశారు.  

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టేందుకు బీజేపీ లీడర్లు పాలమూరులో పర్యటిస్తున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లయినా, ఆసరా పింఛన్లైనా, ఇతర సంక్షేమ పథకాలకైనా లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేయాలని చూస్తే ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదని  హెచ్చరించారు. కలెక్టర్ వెంకట్‌‌రావు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాలేశ్వరం శంకరం, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వర రెడ్డి, పాలమూరు సాహిత్యం అవార్డు వ్యవస్థాపకులు భీంపల్లి శ్రీకాంత్  పాల్గొన్నారు.

పోరాటాలతోనే టీచర్ల సమస్యలు పరిష్కారం

వనపర్తి, నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : సమరశీల పోరాటాల ద్వారానే టీచర్ల సమస్యలు పరిష్కారం అవుతాయని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం రెడ్డి, యుఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు జె.రామస్వామి, కె.శంకర్ అన్నారు.  ఆదివారం యూఎస్పీసీ ఆధ్వర్యంలో వనపర్తి కలెక్టరేట్ ఎదుట, నాగర్‌‌‌‌ కర్నూల్‌‌లోని  గాంధీ పార్కులో  సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీచర్లకు ఎనిమిదేళ్లుగా పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలు లేవని వాపోయారు. హైస్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీవ్రంగా ఉండడంతో బడుగు, బలహీన వర్గాల పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవో కారణంగా ఎంతో మంది టీచర్లు స్థానికతను కోల్పోయారని, వారికి న్యాయం చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే యోసేపు, జిల్లా అధ్యక్షుడు సి.మద్దిలేటి,   కార్యదర్శి చిన్న రాములు, యూటీఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు డి.కృష్ణయ్య,  కార్యదర్శి ఎస్. రవిప్రసాద్ గౌడ్, నాగర్‌‌‌‌ కర్నూల్‌‌ యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ శర్మ, డీటీఎఫ్‌‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు. 

వీఆర్ఏ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  హనుమకొండలో చనిపోయిన వీఆర్‌‌‌‌ఏ వీరయ్య మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వీఆర్ఏల జిల్లా సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలకపల్లి, నాగర్ కర్నూల్ మండల తహసీల్దార్‌‌‌‌ కార్యాలయాల ఎదుట  నిరసన తెలిపారు.అంతకుముందు వీరయ్య మృతికి నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం విజయ్‌‌ కుమార్ మాట్లాడుతూ తాము కొత్త కోరికలు కోరడం లేదని, సీఎం కేసీఆర్‌‌‌‌ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నామన్నారు.మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌‌గ్రేషియాతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.  

కొడుకు పుట్టాక భర్త వదిలేసిండు

అయిజ, వెలుగు : కొడుకు పుట్టిన తర్వాత భర్త వదిలేశాడని ఓ దివ్యాంగురాలు ధర్నాకు దిగింది. ఆమె వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా ఎనుగొండ గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన బాలమణిని ఎనిమిదేళ్ల కింద అయిజ చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన హరిజన్ దేవదాసు పెళ్లి చేసుకున్నాడు. వీరికి కొడుకు పుట్టిన తర్వాత దేవదాసు ఆమెను వదిలేశాడు. అనంతరం మరొకరి పెళ్లి చేసుకున్నాడు.. ఆమెనూ వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు. భర్త వదిలేసినప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న ఆమె కొడుకు కోసమైనా భర్త కావాలని చైతన్య మహిళా సంఘాన్ని ఆశ్రయించింది.  వారితో కలసి ఆదివారం చిన్నతాండ్రపాడు చేరుకున్న ఆమె కొడుకుతో కలిసి భర్త ఇంటి ముందు బైఠాయించింది.  మద్దతుగా మహిళా సంఘం సభ్యులు శ్రీదేవి, శోభ, పద్మ, జయమ్మ పాల్గొన్నారు.  

మహిళల హక్కుల కోసం పోరాడుదాం 
పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర అరుణ

నారాయణపేట, వెలుగు : మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర అరుణ పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ భవన్‌‌లో పీవోడబ్ల్యూ రాష్ట్ర 7వ మహాసభల ఆహ్వాన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా పనిచేస్తున్నా ప్రభుత్వాలు కనీస హక్కులు కల్పించడం లేదని వాపోయారు.  లైంగిక వేధింపులు, దాడులకు గురవుతున్నా.. పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  సీపీఐ ఎం.ఎల్ ప్రజాపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ,  జిల్లా కార్యదర్శి బి రాము మాట్లాడుతూ  మహిళలు నిర్వహించే పోరాటాలకు తమ మద్దతు ఉంటుందన్నారు.  సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిటీ ప్రెసిడెంట్‌‌గా డాక్టర్ గీత, వైస్‌‌ ప్రెసిడెంట్‌‌గా రమ, ప్రధాన కార్యదర్శిగా అరుణతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్‌‌ రాష్ట్ర అధ్యక్షుడు కాశీనాథ్, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బి.యాదగిరి, ఐఎఫ్‌‌టీయూ కార్యదర్శి బి నర్సింహులు, ఏఐకేఎంఎస్  కోశాధికారి కొండ నర్సింలు, పీవోడబ్ల్యూ కార్యదర్శి సౌజన్య, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, నాయకులు సునీత, చంద్రకళ, మంజుల, సరళ, లక్ష్మి, సావిత్రమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహాన్ని ఎట్ల జరుపుతరు?

వనపర్తి టౌన్, వెలుగు : ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికిరాత్రి అంబేద్కర్‌‌‌‌ విగ్రహాన్ని వెనకకు జరపడంపై అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ వేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విగ్రహాన్ని తొలగించిన చోటే బాబాసాహెబ్‌‌ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  రోడ్డు విస్తరణకు తాము వ్యతిరేకం కాదని, 32 ఏళ్ల కిందనే హైకోర్టు పర్మిషన్ తీసుకుని 100 మీటర్ల రోడ్డు విస్తరణ చేసినా ఇబ్బంది లేకుండా పెట్టామని గుర్తు చేశారు. కానీ, అధికారులు ఎలాంటి తీర్మానాలు లేకుండా అంబేద్కర్ చౌక్ లో నుంచి వెనకకు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగనమోని చెన్నరాములు, ఘనపురం కృష్ణయ్య, మెంటెపల్లి రాములు, గంధం నాగరాజు, మీసాల రాము, రాజనగరం రాజేశ్, మంద నరసింహ్మ, చెన్నకేశవులు పాల్గొన్నారు.

నారాయణపేటను ఎడారి చేస్తున్నరు

మద్దూరు ,వెలుగు : సీఎం కేసీఆర్‌‌‌‌ 69 జీవోను పట్టించుకోకుండా నారాయణపేట జిల్లాను ఎడారి చేస్తున్నారని జిల్లా జలసాధన కమిటీ కో కన్వీనర్ నర్సింహ ఆరోపించారు.  ఆదివారం మద్దూరు మండలంలోని రెణివట్లలో సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నారాయణ పేట జిల్లాకు కృష్ణా నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కొడంగల్–నారాయణపే లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీమ్‌‌ చేపట్టాలని నిర్ణయించారని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే 2014 మే23 న అప్పటి గవర్నర్ జీవో 69 జారీ చేశారన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ జీవోను అమలు చేయకుండా ఇక్కడి ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ జీవోతో జిల్లాలోని 10 మండలాల్లో లక్ష ఎకరాలకు నీళ్లు అందించే అవకాశం ఉందన్నారు. రైతులు కరుణాకర్ రెడ్డి, రాంరెడ్డి, రఫీక్, గోవర్ధన్ రెడ్డి, హైమద్, అబ్దుల్ నబి,  రాములు పాల్గొన్నారు.

గణేశ్ నిమజ్జనాలు షురూ..

గద్వాల, కోస్గి టౌన్, వెలుగు : ఉమ్మడి జిల్లాలో గణేశ్ నిమజ్జనాలు ప్రారంభం అయ్యాయి. ఆదివారం వినాయకులకు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు ట్రాక్టర్లలో ప్రతిష్ఠించి డ్యాన్సులు చేస్తూ నిమజ్జనానికి తీసుకెళ్లారు. అంతకుముందు కోస్గి పట్టణంలోని శివాజీ చౌరస్తాలో గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లడ్డూ వేలం పాట నిర్వహించగా.. హరి, రాజు మిత్రబృందం రూ .5 .15 లక్షలకు దక్కించుకున్నారు. గద్వాల పట్టణంలోని భక్త మార్కండేయ దేవాలయంలో నిర్వహించిన లడ్డూ వేలం పాటను పరిమళ సారీ సెంటర్ యజమాని బుదార్పు వెంకటేశ్‌‌ రూ.1.56 లక్షలకు దక్కించుకున్నారు.

కర్ణాటక లిక్కర్ పట్టివేత
కారు స్వాధీనం.. వ్యక్తిపై కేసు  

అయిజ, వెలుగు : కర్ణాటక నుంచి ఏపీలోని కర్నూల్ జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న లిక్కర్‌‌‌‌ను పోలీసులు, ఎక్సైజ్ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ గోపాల్ వివరాల ప్రకారం.. ఏపీలోని నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు రాయచూర్‌‌‌‌లో మద్యం కార్టన్లు కొని కర్నూల్‌‌కు తరలిస్తున్నట్లు ఎస్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసులతో కలిసి అయిజ పట్టణంలోని ఉత్తనూర్ చౌరస్తాలో తనిఖీలు చేపట్టారు. ఏపీ39 ఎఫ్ పీ1786 నెంబర్ గల గ్లాంజా కారును ఆపి తనిఖీలు చేయగా.. 30 కార్టన్ల ఒరిజినల్ ఛాయిస్ (90 ఎంఎల్) కనిపించింది. వెంటనే కారు స్వాధీనం చేసుకొని రామాంజనేయులుపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో స్థానిక ఎస్సై నరేశ్‌‌ కుమార్‌‌‌‌తో పాటు ఎక్సైజ్ సబ్ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ రాజేందర్, కానిస్టేబుల్ రాజు,  ట్రాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్‌‌ గోవింద్, నవీన్  పాల్గొన్నారు.  

లింగాలలో గాలివాన బీభత్సం

లింగాల, వెలుగు : లింగాల మండలంలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. రెండు గంటల పాటు కురిసిన వానకు జీలుగుపల్లి తండా గ్రామానికి చెందిన రేఖ్యా నాయక్ పొలంలో ఉన్న నాటుకోళ్ల షెడ్డుపై చెట్టు విరిగి పడి షెడ్డు కూలిపోయింది. ఇందులో ఉన్న 8 కోళ్లు చనిపోయాయని, షెడ్డుతో కలిపి రూ. 40 వేల నష్టం వచ్చిందని బాధిత రైతు వాపోయాడు. వారాంతపు సంత కావడంతో కూరగాయలు రోడ్డుపై కొట్టుకోపోయాయి.