
- రూ.1.15కోట్లతో సెంట్రల్ లైటింగ్ వర్క్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మాడవీధుల విస్తరణ పనులు ప్రారంభమైనట్టు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత,జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాచలంలోని చర్ల రోడ్డులో రూ.1.15కోట్లతో డివైడర్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం రామాలయం వద్ద మాడవీధుల కోసం చేపట్టిన భూసేకరణ పనులను తనిఖీ చేసి విలేకర్లతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి అడిగిన వెంటనే భూసేకరణకు నిధులు విడుదల చేశారని వివరించారు. మొదటి విడతగా రూ.33కోట్లు ఇవ్వగా భూమిని ఇచ్చిన వారికి పరిహారం పంపిణీ చేశామన్నారు. ఇంకా నాలుగు కుటుంబాలకు ఇవ్వాల్సి ఉందని, వారిని కూడా ఒప్పించి త్వరలో భూసేకరణ పూర్తి చేస్తామన్నారు.
సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆగమ పండితుల సూచనల మేరకు అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో, ఆర్డీవో, తహసీల్దార్లు సమష్టిగా భూసేకరణ పనులు చేపట్టారని వారిని అభినందించారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని స్థానికులు కోరారని,వారి అభ్యర్ధనను పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఐటీడీఏ పీవో బి.రాహుల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ఆర్డీవో దామోదర్‌రావు తదితరులు పాల్గొన్నారు.