ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం రాపర్తినగర్ 58వ డివిజన్ లో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. 1.10 కోట్లతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 58వ డివిజన్ పెద్ద డివిజన్ అని, కొత్త కాలనీలు, ఇంటి నిర్మాణాలు వస్తున్నందున అవసరమైన రోడ్డు, డ్రైన్, తదితర మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దొరైకాలనీలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.కోటి రూమంజూరు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో ముందుగా పనులు చేయాలని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
పట్టణంలోని ఖాళీ స్థలాల యజమానులతో మాట్లాడి భూమి లెవెలింగ్ చేసి, నీరు నిలవకుండా, చెత్తాచెదారం పేరుకుపోకుండా చూడాలన్నారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ టీయూఎఫ్ఐడీసీ కింద వచ్చిన రూ. 100 కోట్ల అభివృద్ధి నిధుల్లో 58వ డివిజన్ పనులకు రూ. 1.10 కోట్లు మంజూరు అయ్యాయని, వర్క్ ఆర్డర్ ఇచ్చామని, రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని, రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు దోరేపల్లి శ్వేత, కమర్తపు మురళీ, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సీహెచ్ స్వామి, అధికారులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగు చేయాలి
రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. శనివారం రఘునాథపాలెం మండలంలోని కోటపాడు, వీఆర్ బంజర, జీకే బంజర, పాపటపల్లి, చిమ్మపూడి గ్రామాల్లో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రఘునాథపాలెం మండలం రైతులు పూర్తి స్థాయిలో ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని, ఎత్తిపోతల పథకం పెట్టి మండలంలోని అన్ని గ్రామాలకు సాగర్ నీళ్లు తీసుకువచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.
స్థలం ఉండి ఇండ్లు లేనివారి జాబితా ఫొటోలతో సహా తయారు చేయాలన్నారు. జమ్ములబాగు బావి క్లీనింగ్ చేసి తాగునీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పెండింగ్ పనులు పూర్తి చేసి సంక్రాంతిలోపు లబ్ధిదారులకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ పంచాయతీ రాజ్ వెంకట్ రెడ్డి, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీవో అశోక్, ఎంపీవో శ్రీనివాస్ రెడ్డి, డీఈ మహేశ్, ఏఈ చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.