టీం వర్క్ తోనే అభివృద్ధి సాధ్యం : తుమ్మల నాగేశ్వరరావు

టీం వర్క్ తోనే అభివృద్ధి సాధ్యం : తుమ్మల నాగేశ్వరరావు
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
  • ఖమ్మం పటేల్ స్టేడియంలో సింథటిక్ రన్నింగ్ ట్రాక్  కుశంకుస్థాపన

ఖమ్మం టౌన్, వెలుగు : ఒక సంస్థ, వ్యవస్థ అభివృద్ధిలో నడవాలంటే టీమ్​వర్క్ తోనే సాధ్యం అవుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి సర్దార్ పటేల్ స్టేడియంలో రూ.8.50 కోట్లతో చేపట్టిన సింథటిక్ రన్నింగ్ ట్రాక్, రూ.50 లక్షలతో చేపట్టిన టేబుల్ టెన్నిస్ షెడ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  సింథటిక్ రన్నింగ్ ట్రాక్ తెలంగాణలో 5 చోట్ల మాత్రమే అందుబాటులో ఉందన్నారు. ఖమ్మం నగరంలో 6వ సింథటిక్ రన్నింగ్ ట్రాక్  నిర్మించుకుంటున్నామని చెప్పారు. 

ఈ ట్రాక్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. క్రికెట్ క్రీడాకారుల కోసం స్టేడియం ఏర్పాటు చేసేందుకు 20 ఎకరాల భూమి గుర్తించాలని ఆర్డీఓను ఆదేశించారు. ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఖమ్మం నగరంలో ఏర్పాటు చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ 25 ఏండ్ల కింద ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియం నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారని, నేడు అదే  స్టేడియంలో మంత్రి వివిధ సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కేంఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య  మాట్లాడుతూ వాలీబాల్ గ్రౌండ్ నిర్మాణానికి వచ్చిన ప్రతిపాదనలు కూడా పరిశీలించి త్వరలో మంజూరు చేస్తామన్నారు. 

అనంతరం సర్దార్ పటేల్ స్టేడియంలో శిక్షణ తీసుకున్న క్రీడాకారులు ఇటీవల నిర్వహించిన సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎక్కువ పతకాలు సాధించినందున వారిని మంత్రి అభినందించారు. సీఎం కప్ విజేతలకు బహుమతులు అందజేశారు. అంతకుముందు ఐటీ హబ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు రూ.1.25 కోట్లతో నిర్మించనున్న ఫుట్ పాత్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.  జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి టి. సునీల్ రెడ్డి, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

బొప్పాయి తోటల పరిశీలన 

రఘునాథపాలెం మండలం సూర్య తండాలో అకాల వర్షానికి దెబ్బతిన్న బొప్పాయి తోటలను మంత్రి, ఎంపీ, కలెక్టర్​ పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే 25 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. రెండు, మూడు రోజులుగా కురిసిన రాళ్ల వాన, అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలపై కలెక్టర్లు నివేదికలు పంపారని తెలిపారు. పంట మార్పిడి విధానంతో అకాల వర్షాల నష్టాలను తగ్గించవచ్చని చెప్పారు. ఆయిల్ పామ్ లాంటి లాభసాటి పంటలను సాగు చేయాలని సూచించారు.