‘సీతారామా’ కెనాల్స్పై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు : మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు

‘సీతారామా’ కెనాల్స్పై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు : మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్ట్​ కెనాల్స్​పై సోలార్​ పవర్​ ప్లాంట్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని అగ్రికల్చర్​ మినిస్టర్​తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని అనిశెట్టి పల్లిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవాన్ని మంత్రి ప్రారంభించారు. అక్కడే పలు శాఖలకు చెందిన జిల్లా ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజీ కొత్తూరు నుంచి గండుగుల పల్లి వరకు ఎస్ఆర్ఎల్పీపై దాదాపు 2వేలకు పైగా ఎకరాల్లో సోలార్​పవర్ ప్లాంట్లతో పాటు పండ్ల మొక్కలు పెంచేందుకు ప్లాన్​ చేయాలన్నారు. 

మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్​ ప్లాంట్లు ఏర్పాటు చేయవచ్చా అనే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంతాలకు గోదావరి నీళ్లు ఇచ్చేందుకు ప్లాన్​ చేస్తున్నామన్నారు. అధికారులు రైతులను ఒప్పించి భూ సేకరణ చేస్తే ఎస్ఆర్ఎల్​పీ కెనాల్స్​ తవ్వించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. ఎర్త్​ సైన్సెస్​ యూనివర్శిటీలో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటులో కొన్ని టెక్నికల్​ ప్రాబ్లమ్స్​ ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. భద్రాచలంలోని కోదండ రామాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మారేడు పాక లిఫ్ట్​ ఇరిగేషన్​ పూర్తి చేస్తే భద్రాచలంలో సాగు నీటికి ఇబ్బంది ఉండదన్నారు. గోదావరి నీళ్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాడుకోవడంతో పాటు అవసరమైతే కృష్ణ బేసిన్​కు ఇస్తామని చెప్పారు. పోడు భూముల్లో అవసరమైన మొక్కలు పెంచాలన్నారు.

 భద్రాచలం టు కౌటాల వరకు నేషనల్​ హైవే నుంచి కిరండోల్​ రైల్వే లైన్​ను సారపాక వరకు పొడిగించే విధంగా రైల్వే శాఖాధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. చర్ల నుంచి వెంకటాపురం, చర్ల, మణుగూరు ప్రాంతాల నుంచి వందలాది ఇసుక లారీలు రోడ్డుపైనే నిలపడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ములుగు ఎస్పీతో కో ఆర్డినేషన్​ చేసుకొని సమస్య పరిష్కరించాలని ఎస్పీ రోహిత్​ రాజుకు సూచించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెం_పాల్వంచ మధ్యలో గల అటవీ ప్రాంతంలో జూ పార్క్​ ఏర్పాటుకు పరిశీలన చేయాలన్నారు. 

రోజుకో మొక్క నాటుతున్న విశ్వామిత్ర అనే బాలుడిని మంత్రి అభినందించారు. ఈ ప్రోగ్రాంలో కలెక్టర్​ జితేశ్​వీ   పాటిల్​, ఎస్పీ బి. రోహిత్​ రాజు, డీఎఫ్​ఓ కిష్టాగౌడ్​, ట్రైనీ కలెక్టర్​ శర్మ, రెడ్కో జిల్లా మేనేజర్​ అజయ్​, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు కాంగ్రెస్​ నేతలు మోత్కూరి ధర్మారావు, నాగ సీతారాములు, బిక్కసాని నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

ఆఫీసర్లపై పొదెం ఫైర్​ : ఫారెస్ట్​ అధికారులు ప్రోటోకాల్​ పాటించకపోవడంపై ఫారెస్ట్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ చైర్మన్​ పొదెం వీరయ్య ఫైర్​ అయ్యారు. వన మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్​కు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో తన ఫొటో పెట్టకపోవడంపై ఆయన ఆఫీసర్లపై మండిపడ్డారు.