
- రైతులకు మేలైన విత్తనాలు అందిస్తున్నాం: మంత్రి తుమ్మల
- పంట కొనుగోళ్లు స్పీడప్ చేశాం
- ‘రైతునేస్తం’ కార్యక్రమంలో రైతులకు పప్పుదినుసులు, నూనెగింజల విత్తనాల పంపిణీ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందే నిధులను పూర్తిగా వినియోగించుకునేందుకు రాష్ట్ర వాటా విడుదల చేసి రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ‘రైతునేస్తం’ కార్యక్రమంలో భాగంగా సెక్రటేరియట్లో జాతీయ ఆహార భద్రత పథకం కింద నాణ్యమైన పప్పుదినుసులు, నూనెగింజల విత్తనాలను రైతులకు మంత్రి పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర-, రాష్ట్ర వాటాలతో అమలయ్యే పథకాలను ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంతో రైతులు దాదాపు రూ.3వేల కోట్లు నష్టపోయారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి కేటాయించిన నిధులను తిరిగి ఇతర రాష్ట్రాలకు మళ్లించడంతో రైతుల హక్కులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేంద్ర నిధులను పూర్తిగా వినియోగించుకుని, రాష్ట్ర వాటాను విడుదల చేసి రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వరిసాగుతో పాటు పప్పుదినుసులు, నూనెగింజల సాగును పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ యాసంగి సీజన్‌లో రూ.2.68 కోట్ల సబ్సిడీతో 49,397 ఎకరాలకు సరిపడా 5,825 క్వింటాళ్ల శనగ విత్తనాలను 14 జిల్లాల్లో పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గత వారం పంపిణీ చేసిన వేరుశనగతో పాటు పొద్దుతిరుగుడు (83.78 క్వింటాళ్లు), కుసుమ (74 క్వింటాళ్లు) విత్తనాలకు 45.41 లక్షల రూపాయలు వెచ్చించామని తెలిపారు. 2025–-26లో రూ.48.54 కోట్లతో జాతీయ ఆహార భద్రతా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు. విత్తనాలతో పాటు ప్రదర్శన క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
మక్క విషయంలో కేంద్రం అన్యాయం చేసింది
పత్తి కొనుగోలు కేంద్రాలు బుధవారం ప్రారంభమవుతున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. సీసీఐ 317 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసిందని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా 21,07,272 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించారు. మొబైల్ నంబర్ అప్‌డేట్ సౌకర్యం కల్పించామని, ఏఈఓ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు. బుధవారం ఖమ్మం జిల్లాలో, 24న నల్గొండలో కేంద్రాలు ప్రారంభమవుతాయని, ఇతర జిల్లాల్లో వెంటనే ప్రారంభిస్తామన్నారు.
రైతుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1800 -599-5779 ఏర్పాటు చేశామని చెప్పారు. మొక్కజొన్న కొనుగోలు విషయంలో కేంద్రం మద్దతు ధర ప్రకటించి కొనకుండా వదిలేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 6,24,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగైందని, 11,55,000 టన్నుల ఉత్పత్తి అంచనా ఉందన్నారు. 204 కేంద్రాలు ప్రతిపాదించగా, 100 ప్రారంభమయ్యాయని, 30 కేంద్రాల ద్వారా 220 టన్నులు కొనుగోలు చేశామని వివరించారు. మిగతా కేంద్రాలు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.