ఖమ్మం మాస్టర్ ప్లాన్ త్వరలో ఆమోదం : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం మాస్టర్ ప్లాన్ త్వరలో ఆమోదం : తుమ్మల నాగేశ్వరరావు

 ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఖమ్మం నగరం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన మాస్టర్ ప్లాన్ త్వరలో  తయారు చేసి, ఆమోదం పొందుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం కేఎంసీ పరిధిలోని రామచంద్రయ్య నగర్ లో టీయూఎఫ్​ఐడీడీసీ నిధులు రూ.72 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ భూ సమస్యలను అడిషనల్​ కలెక్టర్, మున్సిపాలిటీ అంశాలను కమిషనర్ బాధ్యత తీసుకొని పరిష్కరించాలన్నారు. ఖమ్మం మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందిన తర్వాత పెండింగ్ భవన నిర్మాణాల అనుమతులు త్వరగా జారీ చేయాలని చెప్పారు. 

కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేశామని, వచ్చే వారం నాటికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపారు.  ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58 ప్రకారం పట్టాలు సంబంధించి రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ వెరిఫికేషన్ చేస్తున్నామని చెప్పారు. అడిషనల్​ కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురైనట్లు సమాచారం అందిందని, దానిని వెంటనే స్వాధీనం చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పూనుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతీమా జోహారా, స్థానిక కార్పొరేటర్ ప్రశాంతి లక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారుల పాల్గొన్నారు.