
- 27 ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాల ఏర్పాటు చేస్తం: మంత్రి ఉత్తమ్
- మంత్రి పొన్నంతో కలిసి సదరన్ ట్రావెల్స్ రీజనల్ ఆఫీస్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందుకు తగ్గట్టుగా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల నుంచి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించిందని, తద్వారా పర్యాటక రంగంలో 3 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ఆయన వెల్లడించారు. శనివారం లక్డికాపూల్ వద్ద సదరన్ ట్రావెల్స్ రీజనల్ ఆఫీస్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మార్చి 17 నుంచి అమలులోకి వచ్చిన 2025–30 పర్యాటక రంగ పాలసీని అమలు పరిచి.. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని టాప్ 5 లో ఉంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంతో పాటు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం ఈ పాలసీలో భాగమని ఆయన తెలిపారు. టూరిజంలో సదరన్ ట్రావెల్స్ 50 ఏండ్లుగా తనకంటూ మంచి గుర్తింపు సాధించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా సదరన్ ట్రావెల్స్ విస్తరిస్తున్నందుకు యాజమాన్యానికి మంత్రి అభినందనలు తెలిపారు. రవాణాతో పాటు టూరిజం లోనూ ప్రయాణికులకు మరింత విశ్వాసం కల్పించేలా కష్టపడాలని ఆయన సూచించారు.