కృష్ణా, గోదావరిలో చుక్క కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్

కృష్ణా, గోదావరిలో చుక్క కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్
  • తెలంగాణ నీటి హక్కుల కోసం అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తం: మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆర్టికల్ 131 ప్రకారం త్వరలో సుప్రీంకోర్టులో సివిల్ సూట్ వేస్తం
  • పోలవరం- నల్లమలసాగర్ విషయంలో బలమైన వాదనలు వినిపించినం
  • ఏపీ సర్కారు అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయాన్ని వివరించామని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణా, గోదావరి నదీ జలాల్లోని ఒక్క చుక్కను కూడా  తెలంగాణ వదులుకోబోదని  రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  తేల్చి చెప్పారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడుకునేందుకు అన్ని స్థాయిల్లో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.  చర్చల ద్వారానే జలాల సమస్యను పరిష్కరించుకుందామంటున్న రెండు రాష్ట్రాల సీఎంలతో అందరం ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. అయితే... పోలవరం – నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏ అనుమతులు లేవన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.అయితే... పోలవరం – నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్‌‌కు ఏ అనుమతులు లేవన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అందుకే తెలంగాణ నీటి హక్కులను కాపాడుకునేందుకు లీగల్‌‌గా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి పథకం, కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులకు ఏపీ అభ్యంతరాలు చెబుతున్నదన్నారు. ‘‘వీటిని ఏపీ విరమించుకుంటే పోలవరం – నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఓకే చెప్తారా?’’ అన్న మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ... దీనిపై సీఎం రేవంత్ నిర్ణయం తీసుకుంటారని సమాధానమిచ్చారు.  ఏపీ నిర్మించతలపెట్టిన పోలవరం–నల్లమల్ల సాగర్ (బనకచర్ల) లింక్ ప్రాజెక్ట్‌‌ను ఆపాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ సోమవారం మరోసారి సీజేఐ బెంచ్ ముందు  విచారణకు వచ్చింది.  రాష్ట్రం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మనుసింఘ్వీ.. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్, స్టేట్ లీగల్‌‌ కౌన్సిల్ ఓరా, సీనియర్ అడ్వకేట్ సాత్విక్‌‌తో  కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వాదనలను పరిశీలించారు.  అనంతరం కోర్టు ఆవరణలో  ఉత్తమ్‌‌ మీడియాతో మాట్లాడారు. పోలవరం– నల్లమల్ల సాగర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తమ  అభ్యంతరాలను బలంగా వినిపించిందని చెప్పారు. 

నేడో, రేపో సివిల్ సూట్..

ఏపీ ప్రభుత్వం నిర్మాణం చేయాలనుకుంటున్న ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలతో రిట్‌‌ పిటిషన్‌‌ వేశామని ఉత్తమ్‌‌ తెలిపారు. ‘‘గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ –  II (జీడబ్ల్యూడీటీ –1980) అవార్డు ప్రకారం.. ఏపీ 484 టీఎంసీలు మినహా అదనపు నీటిని వాడుకోవద్దనే రాష్ట్ర వాదనలను కోర్టులో వివరించాం.  అదనపు నీటి మళ్లింపు, వరద జలాల పేరుతో నీటిని తరలించే యత్నం జీడబ్ల్యూడీటీ అవార్డుకు వ్యతిరేకం. ఏపీ పునర్వి విభజన చట్టంలోని సెక్షన్ 85, 90ని ఏపీ ఉల్లంఘించింది.  పోలవరం వాస్తవ రూపం తప్ప.. అందులో మార్పులు చేయొద్దని, అదనపు నీటిని తరలించే ప్రణాళికలు ఉండొద్దని సెక్షన్ 90లో ఉన్నది. కానీ ఈ లింక్ ప్రాజెక్ట్ పేరిట జీడబ్ల్యూడీటీ కేటాయించిన దానికంటే ఎక్కువ నీటిని ఉపయోగించుకునేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది. డీపీఆర్ మొదలు పెట్టే ప్రయత్నంలో ఉన్నది, ఈ విషయంలో సీడబ్ల్యూసీ ఇప్పటి వరకు అనుమతివ్వలేదు. పోలవరం నిర్మాణంలో ఏపీ సర్కారు అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. ఇదే విషయంలో కేంద్ర పర్యావరణ శాఖ  స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. ఈ విషయాలను తెలంగాణ తరఫున అడ్వకేట్ మనుసింఘ్వీ కోర్టుకు నివేదించారు” అని చెప్పారు. కేంద్ర  జలశక్తి, పర్యావరణ శాఖ, అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కృష్ణా, గోదావరి రివర్ మెనేజ్‌‌మెంట్‌‌ బోర్డుల పర్మిషన్ లేకుండా ఈ లింక్ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని వాదించామన్నారు.  తమ వాదనలపై స్పందించిన ధర్మానసం ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ కాకుండా...  ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్ వేయాలని సూచించారని చెప్పారు.  దీంతో త్వరలో  సివిల్ సూట్ దాఖలు చేస్తామని వెల్లడించారు.