ఆలయ నిర్మాణం పూర్తయ్యాక.. రాములోరిని దర్శించుకుంట: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఆలయ నిర్మాణం పూర్తయ్యాక.. రాములోరిని దర్శించుకుంట: ఉత్తమ్ కుమార్ రెడ్డి

మేళ్లచెరువు, వెలుగు: అయోధ్యలో ఆలయ నిర్మాణం పూర్తయ్యాక రాములవారిని దర్శించుకుంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తన ఫ్యామిలీ మొత్తం రామభక్తులే అని చెప్పారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని శివుడి ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేశాక మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో అసంపూర్ణంగా ఉన్న రామమందిరంలో దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ చేయడం సరైంది కాదన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, పీఠాధిపతి శంకరాచార్యులు కూడా ఇదే మాట చెప్పారని తెలిపారు.

హిందూ ధర్మాన్ని కాపాడే పీఠాధిపతులు కూడా ప్రాణప్రతిష్ఠను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. హిందూ ధర్మం పట్ల మోదీ కంటే పీఠాధిపతులే ఎక్కువ కృషి చేశారని, వారి నిర్ణయాన్ని గౌరవించి ప్రాణ ప్రతిష్ఠ దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత రాములోరిని దర్శించుకోవడానికి అయోధ్యకు వెళ్తానని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని భావిస్తున్నట్టు తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్​ ఈవెంట్​లా ప్రాణప్రతిష్ఠ ప్రోగ్రామ్ ఉందని విమర్శించారు.