
- ఢిల్లీలో సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ తో భేటీ
- ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా మేడిగడ్డ పునరుద్ధరణపై చర్చ
- కృష్ణానదిపై టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
- మేడిగడ్డ రిపేర్‌కు మార్గాలు అన్వేషిస్తున్నం: మంత్రి ఉత్తమ్
- వర్షాలు వచ్చే లోపాలు సాధ్యమైనంత నష్ట నివారణ చర్యలు చేపడతామని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: పాలమూరు–-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, సమ్మక్క-–సారక్క బ్యారేజీకి - నీటి కేటాయింపులను వేగవంతం చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్ జైన్ ను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. కృష్ణా నదిపై టెలిమెట్రీ సిస్టంను ఏర్పాటు చేయాలని విన్నవించారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్ట్ లపై చర్చించేందుకు అతుల్ జైన్ అపాయింట్మెంట్ కోరారు. అయితే.. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా చైర్మన్ బిజీగా ఉండడంతో ముందు ఇచ్చిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయ్యింది.
దీంతో మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి మేరకు సాయంత్రం ఢిల్లీలోని తెలంగాణ భవన్ శబరి బ్లాక్ కు అతుల్ జైన్ వచ్చారు. ఈ సందర్భంగా సుమారు 20 నిమిషాలపాటు సీడబ్ల్యూసీ చైర్మన్ తో మంత్రి చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్, ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్ బసవరాజ్, ఇంటర్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇన్చార్జి సీ విజయ్ కుమార్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్లు పాల్గొన్నారు. భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ప్రజాధనంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ కు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని తెలిపారు.
సీడబ్ల్యూసీ సూచనలతో ముందుకు..
ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించడం లేదని మంత్రి ఉత్తమ్తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ ఫౌండేషన్ టెక్నాలజీ, డిజైన్, నిర్మాణం, ఆపరేషన్ మెయింటనెన్స్ లో లోపాలు ఉన్నాయని తాజాగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తన రిపోర్ట్ లో వెల్లడించిందని చెప్పారు. డీపీఆర్ లో ఒక లొకేషన్ చూపి.. మరో లొకేషన్ లో డ్యాం నిర్మించారని గుర్తించిందన్నారు. ఇన్ని లోపాలు ఉన్నందున.. వీటిని ఏ విధంగా పరిష్కరించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మార్గాలు అన్వేషిస్తున్నదని చెప్పారు.
వర్షాలు వచ్చే లోపు సాధ్యమైనంత వరకు బ్యారేజ్ పునరుద్ధరణ చర్యలు చేపడతామన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి వారంరోజులు అయిందని, బ్యారేజ్ పై సెంట్రల్ వాటర్ కమిషన్ తో సంప్రదింపుల తర్వాత ముందుకెళ్లాలని రిపోర్ట్ లో సూచించిందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ లో ఏవిధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ఇప్పటికే ఫార్మల్ గా చర్చించామని, చైర్మన్ తో జరిగిన భేటీలో ఆ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడామని చెప్పారు.
మేడిగడ్డపై రాష్ట్ర ప్రభుత్వ ప్రపోజల్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తే.. కావాల్సిన సలహాలు, సూచనలు చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. కాగా.. మేడిగడ్డ విషయంలో ప్రభుత్వం పలు ఆలోచనలు చేస్తున్నదని తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కారు మేడిగడ్డ దగ్గర 100 మీటర్లు, తుమ్మిడిహెట్టి దగ్గర 148 మీటర్ల బ్యారేజ్ కడతామని మాట ఇచ్చి తప్పిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ కడతామని చెప్పారు.
పాలమూరుకు 90 టీఎంసీలు ఇవ్వాలని కోరినం
కరువు పీడిత జిల్లాలైన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండలో సుమారు 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను చేపడ్తున్నట్టు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా 60 రోజుల వరద కాలంలో కృష్ణా నది నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి 5 పంపింగ్ స్టేషన్లను ఉపయోగించనున్నట్లు వివరించారు.
ఈ ప్రాజెక్ట్ కు మొత్తం 90 టీఎంసీల నీటి కేటాయింపులు చేయాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ను కోరామన్నారు. మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ లో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో 45 టీఎంసీలు ఈ ప్రాజెక్ట్ కు ఇవ్వాలని, ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క--–సారక్క బ్యారేజీ కు 44 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఇందుకు అవసరమైన అన్ని మ్యాప్‌లు, డాక్యుమెంట్స్‌ను సమర్పించినట్టు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేటాయింపుల విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారని తెలిపారు.
టెలిమెట్రీపై చర్చించినం
కృష్ణా నది నుంచి ఏపీ సర్కారు అక్రమంగా తరలిస్తున్న జలాలను కట్టడి చేసేందుకు టెలిమెట్రీ సిస్టం ఏర్పాటు చేయాలని మరోసారి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్టు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుతం సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లకు చైర్మన్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందువల్ల పోలవరం బ్యాక్ వాటర్, కృష్ణా పై టెలిమెట్రీ సిస్టంపై ప్రత్యేకంగా చర్చించినట్లు వెల్లడించారు.
ఈ టెలిమెట్రీ విధానం ద్వారా ఏపీ, తెలంగాణ వాడుకుంటున్న నీటి కేటాయింపులను లెక్కించాలని కోరారు. రాష్ట్ర నీటి వాటాను కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇదే విషయాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో జరిగిన భేటీలో సీఎం, తాను స్పష్టం చేశామని చెప్పారు. అందులో భాగంగా టెలిమెట్రీ సిస్టం ఏర్పాటుకు కొన్ని నిధుల్ని కృష్ణా రివర్ మెనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) కి కేటాయించినట్లు చెప్పారు.
ఈ నిధులతో తక్షణమే కృష్ణా రివర్ పై టెలిమెట్రీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో తెలంగాణ ప్రాంతంలో కొంత ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై డీటెయిల్డ్ స్టడీ చేసి.. తెలంగాణకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని చైర్మన్ ను కోరామని తెలిపారు.