
పాలకవీడు, వెలుగు: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ గ్రామంలో కృష్ణా నదిపై నిర్మిస్తున్న జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆదివారం ఆయన పరిశీలించి.. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కృష్ణానది జలాల పంపకంలో గత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో కృష్ణానదిలో 811 టీఎంసీలలో ఆంధ్రాకు 500 టీఎంసీలు.. తెలంగాణకు 299 టీఎంసీలకు రాతపూర్వకంగా ఒప్పుకున్నారని విమర్శించారు. కానీ, తాము అధికారంలోకి వచ్చాక నదీ పరీవాహక ప్రాంత ఆయకట్టు, జనాభాను పరిగణనలోకి తీసుకొని కృష్ణానది జలాల్లో తెలంగాణకు 70 శాతం జలాలు కేటాయించాలని ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించామని అన్నారు.
మంగళవారం ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు న్యాయం జరిగే విధంగా వాదనలు వినిపిస్తామని తెలిపారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత-- చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామని తెలిపారు. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మిస్తే.. మూడు సంవత్సరాలకే వారి హయాంలోనే కూలిపోయిందని.. ఎన్ డీ ఎస్ ఏ నివేదిక ప్రకారం బ్యారేజ్ పునరుద్ధరణ పనులు చేపడుతామని వెల్లడించారు.
హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రతిరోజూ సమీక్ష చేస్తానని, ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తానని మంత్రి తెలిపారు. పాలకవీడు మండలంలోని జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా నాణ్యత పాటిస్తూ డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ని మంత్రి ఆదేశించారు.