స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

మేళ్లచెర్వు, మఠంపల్లి, హుజూర్‌‌నగర్‌‌, వెలుగు:  స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని ఇరిగేషన్‌, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.  ఆదివారం మేళ్లచెరువు మండలం  వేపల మాధవరం, చింతల పాలెం మండలం  రేబల్లె , ఎర్రగుంట తండా, మఠంపల్లి మండలం లాలితండా, కొత్త తండాలో గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు.  అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 

ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. గత పాలకులు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని, చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా సర్పంచులు ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తపై కేసులు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే సర్పంచులకు బిల్లులు మంజూరు చేస్తామని చెప్పారు.  మేళ్లచెరువుకు ప్యాసెంజర్ రైలును నడిపేందుకు రైల్యే శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. జిల్లాలో  సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, డీపీవో జ్యోతి పద్మ, డీఎస్‌వో మోహన్ బాబు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
 
జేపీఎస్‌ల సర్వీసు రెగ్యులర్ చేయాలి 

 జూనియర్,  ఔట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శుల సర్వీసును రెగ్యులర్ చేయాలని  ఆ సంఘం జేఏసీ అధ్యక్షుడు ఫరీద్,  కార్యదర్శుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు దున్న విజయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  తమ నాలుగేళ్ల ప్రొబేషనరీ సర్వీసును కౌంట్‌ చేసేలా జీవో రిలీజ్ చేయాలని కోరారు. విది నిర్వహణలో చనిపోయిన కార్యదర్శుల కుటుంబాల్లో  ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు.