
- మహిళా శక్తి సంబురాల్లో మంత్రి వాకిటి శ్రీధర్
- పలు చోట్ల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు
- కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు అందజేత
మక్తల్,వెలుగు: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించగా ఆయన హాజరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని కాంగ్రెస్ నెరవేరుస్తూ ముందుకెళ్తోందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా శక్తి క్యాంటీన్లు, పెంట్రోల్ బంక్ లు, ఆర్టీసీ బస్సులు అప్పగించినట్లు తెలిపారు. అనంతరం ఆత్మకూర్, మక్తల్ మండలాల మహిళా సమాఖ్య సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ కోసం రూ.6 కోట్ల చెక్కును అందించారు. అంతేగాకుండా ప్రమాద బీమా, మినీ గోదాములు, లోన్ బీమా చెక్కులను పంపిణీ చేశారు.
ఆర్టీసీ బస్సుల ప్రారంభం..
మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత, ఊట్కూర్, నర్వ మండలాల్లోని మహిళా సమాఖ్య సంఘాలకు రూ.1.08 కోట్లతో ప్రభుత్వం అందించిన 3 ఆర్టీసీ బస్సులను మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. అనంతరం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ మొగులప్ప, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, ఎంపీడీవోలు, మహిళా సమాఖ్య అధ్యక్షులు పాల్గొన్నారు.
కుట్టు మిషన్లు పంచిన ఎమ్మెల్యే..
జడ్చర్ల టౌన్: మహిళా శక్తి సంబురాల్లో భాగంగా జడ్చర్లలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, కలెక్టర్ విజయేంద్ర బోయి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్ పాల్గొన్నారు. అనంతరం మహిళా సంఘాలకు రూ.3.36 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు.
మహిళల అభివృద్ధితోనే పేదరిక నిర్మూలన..
ఆమనగల్లు: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లులో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా 2,378 మహిళా సంఘాలకు రూ.2.29 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండలో..
కోయిలకొండ: మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలో మహిళా సంఘాల సభ్యులకు రూ.94.64 లక్షల వడ్డీ లేని రుణాలు, బ్యాంకుల ద్వారా రూ.5 కోట్ల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన ఐదుగురి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున బీమా చెక్కులు పంపిణీ చేశారు. కలెక్టర్ విజయేందిర బోయి పాల్గొన్నారు.
గట్టులో..
గద్వాల: గట్టు మండలకేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు రూ.7.25 కోట్ల బ్యాంకు రుణాల చెక్కు, రూ.47.96 లక్షల వడ్డీ లేని రుణాల చెక్కుతో పలువురికి కొత్త రేషన్ కార్డులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ సంతోష్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు పాల్గొన్నారు.