అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి

ఊట్కూర్, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూరులోని రైతు వేదికలో 1261మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, 122 మందికి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూమి కోల్పోయిన 14 మంది రైతులకు రూ.50 లక్షల నష్టపరిహారం చెక్కులను అడిషనల్​కలెక్టర్ శ్రీనుతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఊట్కూర్ మండలం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మండలానికి 500 ఇండ్లు మంజూరు చేశానని, అదనంగా మరో 500 ఇండ్లు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే అంటే కొమ్ములు ఉండవ్

ఎమ్మెల్యే అంటే కొమ్ములు ఉండవని తాను పేదల ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు.  మక్తల్ నియోజకవర్గంలోనే రైతులకు రూ.39 కోట్ల బోనస్ అందజేసినట్లు మంత్రి తెలిపారు. రూ.363 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైందని చెప్పారు. ఆర్డీఓ రామచంద్రనాయక్, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, హౌసింగ్ పీడీ శంకర్ నాయక్ కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు. 

తల్లి పేరుతో మొక్క నాటండి

మక్తల్/ఊట్కూర్, వెలుగు: ప్రతి ఒక్కరు తమ తల్లి పేరుపై ఓ మొక్కను నాటాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. శుక్రవారం మక్తల్ మండలంలోని సంగంబండ రెసిడెన్షియల్ స్కూల్​లో వనమహోత్సవంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు.  తన తల్లి రాములమ్మ  పేరుతో మొక్క నాటుతున్నాను.. మీరు కూడా మీ తల్లి పేరుతో మొక్కలు నాటి వాటిని రక్షించాలని విద్యార్థులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్,  డీఆర్‌‌‌‌డీవో మొగులప్ప, ఆఫీసర్లు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.