వనపర్తి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. బుధవారం వనపర్తిలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి రూ. 1.20 కోట్ల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
సంక్షేమ హాస్టల్‌లో చదివిన ఎంపీ మల్లు రవి, విద్యార్థుల కష్టాలు తెలిసి హాస్టల్ భవన నిర్మాణానికి సహకరించడం అభినందనీయమన్నారు. అనంతరం మర్రికుంటలోని కేజీబీవీలో రూ. 80 లక్షలతో అదనపు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నర్వ : మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి బుధవారం పర్యటించారు. సుమారు రూ. 7.30 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. సీపూర్ గ్రామంలో రూ. 6.4 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జికి, జక్కన్నపల్లి రోడ్డులో రూ. 90 లక్షలతో నిర్మించే రెండు కాజ్‌వే బ్రిడ్జిలకు, రాయికోడులో నూతన 33/11కేవీ విద్యుత్ ఉప సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
మరికల్ మండలంలోని బుడ్డగాని తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అంతకుముందు బెక్కరపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో, నర్వ ఎంపీడీవో కార్యాలయం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, రాయితీ వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. జంగం రెడ్డిపల్లిలో దివంగత కాంగ్రెస్ నాయకులు బద్దిపల్లి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు.
