జూబ్లీహిల్స్‌‌లో సమస్యలకు శాశ్వత పరిష్కారం : మంత్రి వివేక్

జూబ్లీహిల్స్‌‌లో సమస్యలకు శాశ్వత పరిష్కారం : మంత్రి వివేక్
  • నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తున్నం: మంత్రి వివేక్​
  • జూబ్లీహిల్స్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు వివేక్, పొన్నం పర్యటన
  • రహమత్‌‌ నగర్‌‌‌‌లో రూ.65 లక్షలతో డ్రైనేజీ అభివృద్ధి పనులు ప్రారంభం

జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్య అయిన డ్రైనేజీ, నాలాలు, ఓవర్ ఫ్లో సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడ సర్కిల్‌‌లోని కృష్ణా నగర్‌‌‌‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు వివేక్, హైదరాబాద్‌‌ జిల్లా ఇన్‌‌చార్జ్‌‌ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మోకాళ్ల వరకు ఉన్న నీళ్లలోకి దిగి, వరద బాధితులను పరామర్శించారు. వర్షపు నీరు చేరిన ఇండ్లను పరిశీలించారు.

 భారీ వర్షం వచ్చినప్పుడు తమ ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయని స్థానికులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. నాలాల పునర్‌‌‌‌ నిర్మాణం, అభివృద్ధి పనులు, డ్రైనేజీలో సిల్ట్ తొలగింపు పనులకు అనుమతులు వచ్చాయని స్థానికులకు వివేక్‌‌ తెలిపారు. వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అనంతరం రహమత్ నగర్ డివిజన్‌‌లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఇన్‌‌చార్జి ముఖ్యనేతల సమావేశంలో మంత్రులు వివేక్,​ పొన్నం, తుమ్మల నాగేశ్వర్‌‌‌‌ రావు మాట్లాడారు. 

నియోజకవర్గంలో అభివృద్ధి బాధ్యత మాదే: మంత్రి వివేక్​ 

జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తమదే అని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. రూ.65 లక్షలతో శనివారం నుంచే డ్రైనేజీ ఓవర్ ఫ్లో సమస్యను పరిష్కరించేందుకు పనులు ప్రారంభిస్తామన్నారు. కాళేశ్వరం పేరుతో గత బీఆర్ఎస్ లీడర్లు రూ.లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని, పదేండ్లు పాలించి రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, అర్హులైనవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని గుర్తుచేశారు. రహమత్ నగర్ ముస్లింలకు ఖబరిస్థాన్ కావాలని అడిగారని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. 

పదేండ్ల సమస్యలను పరిష్కరిస్తున్నం: మంత్రి పొన్నం

పదేండ్లుగా పరిష్కారం కాని అనేక సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పదేండ్లుగా ఎన్నో సంక్షేమ పథకాల కోసం, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని, తమ ప్రభుత్వం పేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తోందని తెలిపారు. రహమత్ నగర్ కాలనీ వాసులకు ఉపాధి మార్గాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అర్హులకు స్థానికంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని విమర్శించారు. 

జూబ్లీహిల్స్‌‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అభ్యర్థి పోటీ చేసినా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. కంటోన్మెంట్‌‌లో ఎలాగైతే అక్కడ ప్రజలు కాంగ్రెస్‌‌ను గెలిపించుకున్నరో.. ఇక్కడా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. 40 ఏండ్ల క్రితం రహమత్ నగర్‌‌‌‌లో ఎన్నికల కోసం పనిచేశానని గుర్తుచేశారు. గ్యాస్, ఉచిత కరెంటు, ఫ్రీ బస్సు మరికొన్ని హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చించదన్నారు. కార్యకర్తల మనోభావాలు అనుగుణంగా నాయకులందరికీ పదవులు ఇస్తామన్నారు.

హైదరాబాద్​లో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జూబ్లీహిల్స్​నియోజకవర్గంలోని కృష్ణానగర్లో గురువారం రాత్రి ఒక వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు.  అదృష్టవశాత్తు అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ  వీడియో చూసిన మంత్రి వివేక్​ శనివారం మంత్రి పొన్నంతో కలిసి ఆ ప్రాంతంలో పర్య టించారు. గత  30ఏళ్లుగా వర్షం పడిన ప్రతిసారి ఇదే సమస్యను ఎదుర్కొంటున్నామని మంత్రికి వివరించగా..నాలా రిపేర్ల కోసం రూ.65 లక్షలు కేటాయించామని, వెంటనే పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా  అక్కడే ఉన్న స్థానికులు మంత్రి వివేక్​ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలిపారు.