
దుబారా ఖర్చులతో తెలంగాణ రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి బీఆర్ఎస్ నేతలు నెట్టివేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కొందరు అప్పటి ప్రభుత్వమే బాగుండె అని అంటున్నారు.. అప్పుడు కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అనే విషయాన్ని గుర్తించుకోవాలని అన్నారు మంత్రి వివేక్.
ఆదివారం (అక్టోబర్ 12) మంచిర్యాల జిల్లాలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కోటపల్లి మండలంలోని బబ్బేరు చెలుక, దేవులవాడ గ్రామాల కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంట నష్టపోతున్న రైతులతో మాట్లాడారు. భూముల కొనుగోలు పై రైతులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డీవో, స్థానిక తహసీల్దార్ తో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు మంత్రి.. రైతుల భూములను ప్రభుత్వ నిబంధన ప్రకారం అక్టోబర్ 18న నోటిఫికేషన్ జారీ చేసి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు అధికారులు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్..ఇక్కడ రైతులను ఆదుకోవాలని మంత్రులతో మాట్లాడి రూ.10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదనీ.. ప్రతి ఒక్కరికీ పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ నేతలు కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగిందని విమర్శించారు. తమ తండ్రి కాకా వెంకటస్వామి హయాంలో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టడానికి ప్రయత్నించారని.. అప్పట్లో 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని.. ఈ ప్రాజెక్టుతో పంటలు నీట మునుగుతున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వాడకుండానే రికార్డు స్థాయిలో పంటలు పండించుకున్నట్లు గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుడు నిర్ణయాల వల్లే ఈ దుస్థితి వచ్చిందని దుయ్యబట్టారు.