
- త్వరలో కొత్త రేషన్ షాపుల ఏర్పాటు
- ఇందిరమ్మ ఇండ్ల కోసం దళారులను ఆశ్రయించొద్దు
- ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి
సిద్దిపేట/ములుగు, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ప్రభుత్వం పనిచేస్తోందని ఉమ్మడి మెదక్జిల్లా ఇన్చార్జి మంత్రి, కార్మిక శాఖ మంత్రి వివేక్వెంకట స్వామి అన్నారు. ఆదివారం గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్, గజ్వేల్, జగదేవ్పూర్, మర్కుక్, ములుగు మండలాల్లో పర్యటించి లబ్ధిదారులకు 3967 కొత్త రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల మేలు కోసమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, ఖర్చులు తగ్గించుకొని, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
రేషన్ కార్డుల ద్వారా అనేక పథకాలు పొందే అవకాశం ఉంటుందని లబ్ధిదారులు వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు, పాత రేషన్ కార్డుల్లో కొత్తగా పేర్లు చేర్చడం వల్ల ప్రస్తుతం ఉన్న రేషన్ షాప్ లపై భారం పడుతుందన్నారు. ప్రజల కోరిక మేరకు త్వరలోనే జిల్లాలో కొత్త రేషన్ షాపులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రానున్న మూడేండ్లలో 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, గజ్వేల్ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చామని జిల్లాకు12 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని గుర్తుచేశారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం లబ్ధిదారులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం పారదర్శకంగా బిల్లులను చెల్లిస్తుందని వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరై కట్టుకునే స్థోమత లేని వారికి ముందస్తుగా లక్ష రూపాయల రుణాన్ని స్వయం సహాయక సంఘాల ద్వారా అందిస్తున్నామన్నారు.
అర్హత ఉండి ఇల్లు మంజూరు కానీ వారు నిరుత్సాహపడవద్దని రెండో విడతలో ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేస్తే వాటికి ప్రతినెలా రూ.6 వేల కోట్ల వడ్దీ కడుతున్నామని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరగలేదు కానీ ఖర్చు మాత్రం పెరిగిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, అడిషనల్కలెక్టర్లు గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి పాల్గొన్నారు.
స్వల్ప వివాదం
గజ్వేల్ సమావేశం సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, పీసీసీ స్పోక్స్ పర్సన్ శ్రీకాంత్ రావు వర్గాల మధ్య స్వల్ప వివాదం జరిగింది. శ్రీకాంత్ రావు వర్గానికి చెందిన ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి వేదిక పైకి వెళ్లే ప్రయత్నం చేయగా నర్సారెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరి నొకరు తోసుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదే సమయంలో మంత్రి వివేక్ జోక్యం చేసుకుని నర్సారెడ్డి, మల్లారెడ్డిని వేదికపైకి ఆహ్వానించడంతో వివాదం సద్దుమణిగింది.