- ప్రతి గ్రామానికి రూ.20 లక్షల నిధులిస్తా
- చెన్నూరులో 100 పడకల ఆస్పతి
- సర్పంచ్‌లతో సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు: పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. శనివారం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో చెన్నూరు, కోటపల్లి మండలాల సర్పంచ్‌లతో మంత్రి సమావేశమై మాట్లాడారు. ప్రజలతో సమన్వయం చేసుకుంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు అందేలా చూడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా త్వరలోనే గ్రామానికి రూ.10 లక్షల ఫండ్స్ మంజూరవుతాయన్నారు. మే నెలలో చెన్నూరులో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామన్నారు. సోమనపల్లిలో రూ.250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు.
చెన్నూరు పట్టణంలో రూ.200కోట్ల వివిధ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని, మరో మూడు నెలల్లో పూర్తిచేస్తామని పేర్కొన్నారు. ముదిరాజ్, కాపు కులస్తులకు కమ్యూనిటీ హాల్స్, మేరు సంఘం భవనానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నీటి ఎద్దడి తీర్చేందుకు నియోజకవర్గంలో 250 బోర్లు వేయించామన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.70 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్‌లు
చెన్నూరు మండలంలోని కత్తెరశాల, నారాయణ పూర్, వెంకంపేట గ్రామాల సర్పంచ్‌లు చేతెల్లి పద్మ, మోహన్ రెడ్డి, అయిత రాజిరెడ్డి, సంతోష్ మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరికి డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్మహేశ్ తివారీ, కాంగ్రెస్ లీడర్లతో కలిసి మంత్రి పార్టీ కండువాలు కప్పిఆహ్వానించారు.
