ఇండ్లు కూలినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు.. దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఇండ్లు కూలినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు.. దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • వరద బాధితులను ఆదుకుంటం
  • అన్ని విధాలుగా అండగా ఉంటం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • ఇండ్లు కూలినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు 
  •  దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇస్తామని వెల్లడి 
  • మెదక్‌‌‌‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన 
  • కలెక్టరేట్‌‌‌‌లో అధికారులతోనూ రివ్యూ
  • ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం 


మెదక్, వెలుగు: వరద బాధితులను ఆదుకుంటామని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌‌‌‌చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. కుండపోత వానలతో అతలాకుతలమైన మెదక్ జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. ఓవైపు ఎడతెగని వాన, మరోవైపు రోడ్లు తెగిపోయినప్పటికీ.. దాదాపు 4 గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగారు. ఇంటింటికీ వెళ్లి బాధితులతో మాట్లాడారు. మెదక్‌‌‌‌లోని వెంకటేశ్వర గార్డెన్స్‌‌‌‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న సర్ధన గ్రామస్తులను పరామర్శించారు. వాళ్ల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇండ్లు కూలిపోయినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు, దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందజేస్తామని చెప్పారు. ఆ తర్వాత హవేలీ ఘనపూర్​మండలం నాగాపూర్​వద్దకు వెళ్లిన వివేక్.. అక్కడ వరదకు కొట్టుకుపోయిన నేషనల్ హైవేను పరిశీలించారు. అలాగే బ్యాతోల్ వెళ్లే రూట్లో, తిమ్మాయిపల్లి వెళ్లే రూట్లో కొట్టుకుపోయిన బ్రిడ్జి, రోడ్డును పరిశీలించారు. 

అక్కడి నుంచి బూర్గుపల్లి చేరుకుని డ్యామేజీ అయిన రోడ్డును పరిశీలించారు. రోడ్డు పూర్తిగా తెగిపోయి సన్నని రాతి గోడ మాత్రమే మిగలగా.. దాని పైనుంచి అవతలి వైపుకు వెళ్లారు. అక్కడి నుంచి స్థానికుల కారులో రాజ్‌‌‌‌పేట వెళ్లిన వివేక్.. అక్కడ దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం జలదిగ్బంధంలో చిక్కుకున్న దూప్‌‌‌‌సింగ్ తండా దగ్గరికి వెళ్లారు. వరద ప్రవాహం తగ్గగానే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్​రాజ్  ఉన్నారు. 

రోడ్ల రిపేర్లు వెంటనే చేయండి.. 

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదే శించారు. వర్షాలు, వరదలపై గురువారం మెదక్ కలెక్టరేట్‌‌‌‌లో ఆయన రివ్యూ నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం పడిందన్నారు. మానవతా దృక్పథంలో పంట నష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల తాత్కాలిక మరమ్మతులకు ఎన్ని నిధులు కావాలి? శాశ్వత పరిష్కారా నికి ఎన్ని నిధులు కావాలనే దానిపై అంచనాలు తయారు చేసి పంపాలని ఆదేశించారు. రోడ్లు తెగిన చోట వెంటనే రిపేర్లు చేయించాలన్నారు.

 ‘‘వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు రూ.కోటి చొప్పున సీఎం మంజూరు చేశారు. జిల్లాలో వరద నష్టం ఎక్కువగా ఉన్నందున మరిన్ని నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తాను. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాల” అని సూచించారు. వర్షాల వల్ల ఇండ్లు కూలిపోయినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. 

లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించండి

కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద పోటెత్తడంతో ఆఫీసర్లు గురువారం సాయంత్రం ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు దిగువన ఉన్న జైపూర్​మండలం వేలాలతో పాటు కిష్టాపూర్, ఫౌనూర్, శివ్వారం గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి వివేక్​వెంకటస్వామి.. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫోన్​చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరదల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వరద ఉధృతి పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్‌‌ను ఆదేశించారు.