
- మాలమహానాడు నాయకులకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ
భద్రాచలం, వెలుగు : ఆంధ్రాలో విలీనమైన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపే విషయాన్ని రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలంగాణ కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భద్రాద్రికొత్తగూడెం జిల్లా మాలమహానాడు కమిటీ నాయకులకు హామీ ఇచ్చారు. శనివారం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పౌల్రాజ్, ముంపు మండలాల ఇన్చార్జి డేగల వంశీలు మర్యాదపూర్వకంగా హైదరాబాద్లో కలిశారు.
ఏడు మండలాలను పోలవరం ఆర్డినెన్స్ పేరుతో రాష్ట్ర విభజన సమయంలో నాటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విలీనం చేసిందని, దాని వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. భద్రాచలం రామాలయం అభివృద్ధికి కూడా విఘాతం ఏర్పడుతుందని, రాముని భూములు ఆంధ్రాలో, రాముడు తెలంగాణలో ఉన్నాడని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వారి నుంచి వివరాలు సేకరించిన మంత్రి పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో నాయకులు నక్కా సందీప్, డేగల సన్నీ తదితరులు ఉన్నారు.