జనాదరణ ఓర్వలేక నాపై కుట్రలు : మంత్రి వివేక్ వెంకటస్వామి

జనాదరణ ఓర్వలేక నాపై కుట్రలు : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నరు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు లక్ష్మణ్ వస్తే నేను వెళ్లిపోతున్నాననడం అబద్ధం 
  • రాజకీయాల్లో ఆయనను ప్రోత్సహించింది మా నాన్న కాకా వెంకటస్వామినే
  • దళిత జాతిపై రాజకీయాల్లోనూ వివక్ష ఉంది.. కలిసుంటేనే దీన్ని తిప్పి కొట్టగలం
  • కాకా స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా
  • నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లా మాల సంఘం ఆధ్వర్యంలో కాకా జయంతి

నిజామాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరింత కష్టపడి పనిచేస్తున్నానని, ఈ క్రమంలో తనకు మంచి పేరు రావడం ఇష్టం లేని కొందరు కుట్రలు చేస్తున్నారని కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ను రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఆదివారం నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో జిల్లా మాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కాకా వెంకటస్వామి 96వ జయంతి వేడుకల్లో వివేక్‌‌‌‌‌‌‌‌ పాల్గొని, మాట్లాడారు. ‘‘నాది మాల జాతి.. మాదిగ జాతికి చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వస్తే మీటింగ్‌‌‌‌‌‌‌‌ల నుంచి నేను వెళ్లిపోతున్నానని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. నా తండ్రి కాకా వెంకటస్వామి అందరినీ కలుపుకొని వెళ్లి పేరు సంపాదించారు. 

అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ను పాలిటిక్స్‌‌‌‌‌‌‌‌లో ఎంకరేజ్ చేసింది కూడా మా నాన్నే. యూత్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఆయనకు మొదటిసారి కాంగ్రెస్ టికెట్ ఇప్పించి రాజకీయాల్లో ఎదిగేలా చేశారు’’అని వివేక్‌‌‌‌‌‌‌‌ గుర్తుచేశారు. ‘‘కాకా జయంతి సందర్భంగా సాంస్కృతిక శాఖ ప్రింట్ చేయించిన ఇన్విటేషన్ కార్డులో మాదిగ జాతికి చెందిన తన పేరు లేదని అడ్లూరి లక్ష్మణ్ కామెంట్ చేయడం బాధించింది. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు జయంతి వేడుకల ఇన్విటేషన్ కార్డులో ఎవరి పేరు ముద్రించకున్నా ఎవరూ ప్రశ్నించలేదు. 

అయితే, మాల సామాజిక వర్గానికి చెందిన నన్ను అవమానించారని కామెంట్ చేయాలా? అడ్లూరి నన్ను టార్గెట్ చేసి మీడియాలో విమర్శలు చేయడంతో నేను మాట్లాడాల్సి వస్తోంది”అని అన్నారు. 

అహంకారినని దుష్ప్రచారం..

తాను అహంకారిననే దుష్ప్రచారాన్ని కొందరు నెత్తినేసుకొని తిరుగుతున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘ప్రజలకు, జాతికి సేవ చేయడం తప్పితే గర్వం, అహంకారం నా రక్తంలో లేదు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈ 3 నెలల్లో నా వద్దకు నమ్మకంతో వస్తున్న జనం సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యమైన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు తప్పితే ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తున్న. జూబ్లీహిల్స్, చెన్నూరు, సిద్దిపేటలో యాక్టివ్ రోల్ పోషిస్తున్న. ప్రజల మద్దతు, ఆదరణ నాకు లభిస్తోంది. వారిలో మరింత నమ్మకాన్ని పెంచుతున్న. ఇది కొందరికి నచ్చట్లేదు. నా తండ్రి కాకా వెంకటస్వామి స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా. 

నా తండ్రి మంత్రిగా పని చేసినందున ఒక్కరోజైనా మంత్రిగా పనిచేయాలనే కోరిక నాలో కూడా ఉండింది. అదిప్పుడు తీరింది. దళిత జాతికి అంతటా ఉన్నట్లే రాజకీయాల్లో కూడా వివక్ష ఉంది. మాల, మాదిగ జాతి ఐక్యంగా ఉంటేనే దీనిని తిప్పికొట్టగలం. జూబ్లీహిల్స్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ బాధ్యతలు తీసుకున్నాక అక్కడున్న నెగెటివ్ పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా మారుతోంది. నేనెప్పుడు న్యాయం వైపే ఉంటా.. లైన్​ దాటను”అని మంత్రి వివేక్ పేర్కొన్నారు.  దళిత జాతి అంతా కలిసి ఉంటేనే అణచివేత కుట్రలు చేసే వారి యాటిట్యూడ్‌‌‌‌‌‌‌‌ను మార్చే వీలుంటదని మంత్రి వివేక్ అన్నారు. వివక్షకు వ్యతిరేకంగా కలిసి పోరాడుదామని, అప్పుడే రిజల్ట్‌‌‌‌‌‌‌‌ వస్తుందని చెప్పారు.

నమ్మిన సిద్ధాంతాల కోసం ఎక్కడికైనా వెళ్తరు: ఎమ్మెల్యే నాగరాజు

పదవులు ఉంటాయి.. పోతాయి కానీ రాజ్యాంగ పరమైన హక్కులు జాతికి దక్కేదాకా పోరాటం వీడొద్దని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. పిల్లల భవిష్యత్ కోసం ఇది అవసరమని పేర్కొన్నారు. అనాధిగా ఎదుర్కొంటున్న కుల వివక్ష ఏఐ టెక్నాలజీ వృద్ధి చెందిన సమాజంలో కూడా కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన సిద్ధాంతాల కోసం మంత్రి వివేక్ ఎక్కడిదాకైనా వెళ్తారని.. తలొగ్గడం, భయపడడం ఆయన బ్లడ్‌‌‌‌‌‌‌‌లో లేదన్నారు. చాలా క్లారిటీతో ఉంటారని చెప్పారు. 

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ, ఈ నెల 23న నిర్వహించే రణభేరికి లక్షలాదిగా మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ గడుగు గంగాధర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దేవీదాస్, ప్రొఫెసర్ లింబాద్రి, పర్వయ్య, ఆనంపల్లి ఎల్లమయ్య, ఆలుక కిషన్, అంగడి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. సభలో గ్రూప్ 1, 2 జాబ్స్ సాధించిన మాల విద్యార్థులను సన్మానించారు.

కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు.. 

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: కమీషన్ల కోసమే మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, దుబారా ఖర్చులతో రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు క్యాంపు ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోటపల్లి మండలం దేవులవాడ, అర్జునగుట్ట, రాపన్​పల్లి, రావులపల్లి గ్రామాలకు చెందిన కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు బాధితులతో మంత్రి మాట్లాడారు. నష్టపోయిన పంటలకు రాష్ట్ర సర్కార్ సాంక్షన్ చేసిన రూ.10 కోట్ల పరిహారం పంపిణీ, ముంపు భూముల కోనుగోలుపై మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డీవో శ్రీనివాస్ రావు, కోటపల్లి తహసీల్దార్ రాఘవేంద్రతో సమీక్ష జరిపారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయి.. అర్హత కలిగిన రైతులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులతో తాను తరచూ మాట్లాడి రూ.10 కోట్ల పరిహారం మంజూరయ్యేలా కృషి చేశానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వాడకుండానే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 70 శాతం పంటలు పండించామని తెలిపారు. అనంతరం క్యాంపు ఆఫీసులో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తన పర్యటనలో భాగంగా నిజామాబాద్ వెళ్తున్న మంత్రి.. మార్గమధ్యలో లక్షెట్టిపేటలోని ఉత్కూర్ చౌరస్తాలో ఆగి స్థానిక కాంగ్రెస్, మాల సంఘం లీడర్లతో మాట్లాడారు.