
- దేశంలో దొంగ ఓట్ల బాగోతాన్ని రాహుల్ నిరూపించారు
- కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు వృథా
- బొగ్గు గనుల టెండర్ బిల్లుకు నాడు బీఆర్ఎస్ మద్దతిచ్చి ఇప్పుడు నాటకాలాడుతున్నదని ఫైర్
- మందమర్రి బీ-1 క్యాంపు ఆఫీస్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రివ్యూ
కోల్‌బెల్ట్, వెలుగు: ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని, ఈ నేపథ్యంలో బ్యాలెట్పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇదే విషయంపై ఈసీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విజ్ఞప్తి చేస్తే.. బీజేపీ తప్పుపట్టడం విడ్డూరంగా ఉందని ఫైర్అయ్యారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి బీ-1 క్యాంపు ఆఫీసులో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి వివేక్ వెంకటస్వామి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల సమయంలో ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని, అవకతవకలకు తావులేకుండా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని అన్ని పార్టీలు కోరుతున్నాయని తెలిపారు. బిహార్‌లో గతంలో జరిగిన ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో లక్ష వరకు దొంగ ఓట్లు నమోదైన వాస్తవాన్ని రాహుల్‌గాంధీ మీడియా ముందు బట్టబయలు చేశారని చెప్పారు. ఓటరు జాబితాలు ఇవ్వాలని కోరితే డేటా డిలీట్ చేశామని ఎలక్షన్ కమిషన్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ప్రజలను బీఆర్ఎస్ నమ్మించి మోసం చేసింది
రాష్ట్రంలో పదేండ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని, ప్రజల సొంతింటి కల నెరవేరుస్తామని నమ్మించి మోసం చేసిందని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. అప్పటి ప్రభుత్వం చెన్నూరు అభివృద్ధిని పట్టించుకోలేదని తెలిపారు. ఇసుక, భూ మాఫియా, బియ్యం దందాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుతూ తనను గెలిపించారని, వారి ఆకాంక్ష మేరకు అన్ని దందాలకు తాను చెక్ పెట్టినట్లు చెప్పారు. పట్టణాలు, గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రింకింగ్వాటర్సప్లై కల్పించాలన్న త్రీ పాయింట్ ప్రోగ్రాంతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు.
ఫ్యూచర్లో నీటి సమస్యలు రాకుండా రూ.100 కోట్లతో మందమర్రి, చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో అమృత్ స్కీమ్ కింద పనులు చేపట్టామని, 6 నెలల్లో ట్యాంకులు,పైపులైన్ల పనులు పూర్తవుతాయని తెలిపారు. చెన్నూరుకు బతుకమ్మ వాగు నుంచి వాటర్ సప్లై చేస్తున్న స్కీమ్ కెపాసిటీ సరిపోదని అన్నారు. మరో 15 ఏండ్లవరకు ఇబ్బంది రాకుండా గోదావరి నుంచి రూ.43 కోట్లతో కొత్త స్కీమ్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఈ స్కీమ్‌కు ఫండ్స్ ఇవ్వాలని కేబినెట్‌లో సీఎంను కోరామని తెలిపారు. వచ్చే ఏడాది మంజూరు చేస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా టీచర్ పోస్టులు భర్తీ చేసిందని, మెస్‌చార్జీలు పెంచిందని గుర్తుచేశారు. రూ.200 కోట్లతో సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో వసతులు బాగున్నాయని, దీంతో ఈ ఏడు అడ్మిషన్లు 15 నుంచి 20 శాతం పెరిగాయన్నారు. పదేండ్లు ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్న బాల్క సుమన్.. కేసీఆర్ చిన్న కొడుకునని ఊహించుకుంటూ ప్రగతిభవన్‌కే పరిమితమయ్యాడని, చెన్నూరును పట్టించుకోలేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాతే ఫండ్స్ మంజూరు చేయిస్తూ అభివృద్ది పనులు చేపడుతున్నట్టు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్లకే పరిమితం
కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్లకే పరిమితమైందని, ఆ లక్ష కోట్లతో రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు వచ్చేవని వివేక్ వెంకటస్వామి తెలిపారు. కమీషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రాజెక్టులు, మెగా బిల్డింగ్స్ కట్టిందని, ప్రజల మౌలిక సదుపాయాలను పట్టించుకోలేదని అన్నారు. కాళేశ్వరంలో అనేక అవకతవకలు జరిగాయని, అందుకే ప్రాజెక్ట్ కుంగిందని కేంద్ర సంస్థలు రిపోర్ట్ ఇచ్చాయని చెప్పారు.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కమిటీ సూచనల మేరకు ప్రాజెక్టును వాడటంలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, 17లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. 6 గ్యారెంటీల అమలు, ఇందిరమ్మ ఇండ్లతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రూ.12 వేల కోట్లతో సన్నబియ్యం అందించామని, గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని ప్రజలెవరూ తినలేదని అన్నారు.
కొత్త బొగ్గు గనులు తెస్తం..
బీజేపీ సర్కారు తెచ్చిన బొగ్గు బ్లాకుల టెండర్ల బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలంటూ రాజకీయం చేస్తున్నదని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. టెండర్ ద్వారా బొగ్గు గనులు దక్కించుకుంటే కేంద్రానికి ఎలాంటి పన్నులు చెల్లించనవసరం లేదని, నేరుగా గనులు తీసుకుంటే 14 శాతం పన్ను కట్టాలని వివరించారు. నేరుగా గనులు తీసుకుంటే సంస్థ లాభాలు తగ్గి.. సంస్థకు, కార్మికులకు నష్టం కలుగుతుందని చెప్పారు.
కొత్త గనుల కోసం సింగరేణి టెండర్‌లో పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలిపారు. జైపూర్‌లో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ 800 మెగావాట్ల మూడో యూనిట్‌కు త్వరలో సీఎం రేవంత్‌రెడ్డితో శంకుస్థాపన చేయిస్తామన్నారు. 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. తెలంగాణలోనే తొలిసారిగా మందమర్రిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అందుబాటులోకి తీసుకువచ్చామని, అందులో శిక్షణ పొంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.