- జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి
సిద్దిపేట/దుబ్బాక, వెలుగు: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట పేదలను వంచించిందని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం దుబ్బాక మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తొగుట, దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడారు.
కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ వందల ఎకరాల్లో ఫామ్ హౌస్లు నిర్మించుకొని పేదలకు మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ మంజురు చేసిన ఇందిరమ్మ ఇండ్లతో పేదలు సంతోషంగా ఉన్నారన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా అందరికీ అందుబాటులో ఉంటానని, సమస్య వచ్చినా తనకు ఒక్క ఫోన్ చేస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దుబ్బాక మున్సిపాలిటీలో 10 కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల అసౌకర్యాలను తొలగిస్తున్నామన్నారు.
నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అదే హవా కొనసాగించాలన్నారు. ఒకప్పుడు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని దాన్ని పునరావృతం చేయాలని కోరారు. దుబ్బాక నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
దుబ్బాక మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. రూ.10 కోట్ల యూఎఫ్ఐడీ నిధులతో మురికి కాల్వలు, సీసీ రోడ్లు, కల్వర్టు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. యూఐఎఫ్డీ నిధులతో ఒక్కో వార్డులో రూ.50 లక్షలతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నట్టు వివరించారు. పదేండ్ల పాలన చేసిన బీఆర్ఎస్ రూ.8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని పెట్టినా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి అటంకాలు లేకుండా పనులు చేస్తున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రుణాల వడ్డీని తగ్గించేలా చూసుకుని ఆర్థికంగా వెసులుబాటు కల్పించుకుని మున్సిపాలిటీలకు నిధులు కేటాయిస్తోందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ జరగని వారి జాబితా తనకు అందజేస్తే వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి వారందరికి రుణమాఫీ జరిగేలా చూస్తానని దీనిపై అనవసర రాద్దాంతం వద్దని సూచించారు. కార్యక్రమాల్లో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో సదానందం, చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అమలు
సిద్దిపేట రూరల్: వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అమలయ్యేలా చూస్తామని, సిద్దిపేట నియోజకవర్గానికి మరో 500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి సమీపంలో రూ.2.30 కోట్లతో నిర్మించిన కేజీబీవీ అదనపు భవనాన్ని ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వెల్కటూర్ లో ఇందిరమ్మ ఇండ్లను, సిద్దిపేట అర్బన్ మండలంలోని 10 గ్రామాలకు రూ.10కోట్లతో నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణాన్ని నాంచార్ పల్లిలో ప్రారంభించారు.
అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, డీఐఈఓ రవీందర్ రెడ్డి, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి పూజాల హరికృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, ఎంపీడీవో మార్టిన్ లూథర్, తహసీల్దార్హరికిరణ్, ఏఈ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ నరసింహారెడ్డి, లక్ష్మి పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా ఎటూపోదు..
సిద్దిపేట జిల్లాను తొలగిస్తున్నారంటూ కొంతమంది నాయకులు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. తాను జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేసి, జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయన్నారు సిద్ధిపేట కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతం తెలంగాణ సంప్రదాయాన్ని తెలియజేస్తుందన్నారు. త్వరలోనే సిద్దిపేట పట్టణంలో రూ.15 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్టీఏ కమిటీ సభ్యులు సూర్య వర్మ, తదితరులు పాల్గొన్నారు.
