
- ఇందిరాగాంధీ నిర్ణయంతోనే వారి జీవితాలు మారినయ్
- బంజారాలతో కాకాకు ఎంతో అనుబంధం ఉందని వెల్లడి
- నెక్లెస్‌రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద స్వర్ణోత్సవాలకు హాజరు
హైదరాబాద్/ట్యాంక్‌బండ్/జూబ్లీహిల్స్, వెలుగు: కాంగ్రెస్‌తోనే సమాజంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బంజారాలను ఇందిరాగాంధీ ఎస్టీ జాబితాలో చేర్చడంతో వాళ్ల జీవితాలు మారాయని చెప్పారు. లంబాడీలను షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్‌లో చేర్చి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ బంజారా భారతి ఆధ్వర్యంలో స్వర్ణోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విప్ రాంచంద్రునాయక్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌తో కలిసి ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళి అర్పించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చిన 1976లో తన తండ్రి కాకా వెంకటస్వామి ఆమె కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారని, బంజారాలతో కాకాకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వల్లే తండాలు అభివృద్ధి అయ్యాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో బలరాంనాయక్, రవీంద్రనాయక్ ఎంతో పోరాడారని, ప్రత్యేక రాష్ట్రం వస్తే మేలు జరగడంతోపాటు రిజర్వేషన్లు పెరుగుతాయని ఉద్యమంలో ఎస్టీలు కీలక పాత్ర పోషించారన్నారు. గత ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా చేసి.. అభివృద్ధి చేయడం మర్చిపోయిందని విమర్శించారు.
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా బంజారాలకు ఒకే భాష ఉంటుందని చెప్పారు. బంజారాలు అంతా ఐక్యంగా ఉండాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. బడ్జెట్‌లో దళితులకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం నిధులు కేటాయించాలని అసెంబ్లీలో తాను ప్రస్తావించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తండాల్లో అభివృద్ధి ఊపందుకున్నదని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించేలా నిధులు కేటాయింపులు ఉంటాయని చెప్పారు. బంజారాల వెనుకబాటుతనం, సంస్కృతీ, సంప్రదాయాలను గుర్తించి ఇందిరాగాంధీ ఎస్టీల జాబితాలో చేర్చారని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో పాటు పలువురు బంజారా నేతలు పాల్గొన్నారు.
షేక్‌పేటలోని స్లమ్స్‌ను డెవలప్ చేస్తం
ముస్లింలతో తనకు మంచి అనుబంధం ఉన్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ షేక్‌పేట డివిజన్‌లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌తో కలిసి బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా స్థానిక ముస్లింలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం షేక్‌పేటలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని స్థానికులు మంత్రి వివేక్ దృష్టికి తీసుకుపోయారు.
తాను గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో రాకపోకలు కొనసాగిస్తున్నానని, ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో ఇప్పటికే మాట్లాడినట్లు చెప్పారు. డివిజన్‌లో ఇంకా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే జోనల్ కమిషనర్‌తో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. శనివారం కూడా తాను హకీంషా కాలనీలో పర్యటించి, అక్కడి సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు. షేక్‌పేటలో అనేక స్లమ్స్ ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమస్యల పరిష్కారంపై వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.