పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటం: మంత్రి వివేక్

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటం: మంత్రి వివేక్

భారీ వర్షాలకు పంట నష్టం జరిగిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి వివేక్.  మంచిర్యాల జిల్లాలో  కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించారు  మంత్రి వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత కోటపల్లి మండలంలోని బాబరు చెలుక, సుందరశాల రాంపూర్, దేవులవాడ వెంచపల్లి ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ తో పంట నష్టపోతున్నారని చెప్పారు.  ప్రతీ సంవత్సరం ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.  కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమీషన్ల కోసమే కట్టారని  ఎప్పుడో చెప్పానన్నారు వివేక్.  కేవలం కమీషన్ల కోసమే తుమ్మిదిహెట్టి నుంచి  ప్రాజెక్టును మార్చారని అన్నారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పోయిన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విషయాన్ని అసెంబ్లీలో చెప్పానన్నారు.  ప్రాజెక్టుకు కరకట్టలు కట్టాలని సంబంధిత మంత్రిని అడిగానన్నారు. వరదలను కంట్రోల్ చేసి బ్యాక్ వాటర్ రాకుండా చేస్తామని మంత్రి ఉత్తమ్  కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు వివేక్.    ఇక్కడ జరిగిన వాటిపైన ఒక ఎంక్వయిరీ కమిషన్ వేసి విచారణ జరపాలని మంత్రి ఉత్తమ్ ను  కోరతానన్నారు.