
బీఆర్ఎస్ నాయకులు రాజీకీయం చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు మండలంలోని సుందరశాల గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో పంట నష్టపోయిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పరిశీలించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.ఈ సందర్బంగా కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పత్తి పంట పూర్తిగా నష్టపోయిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు రైతులు. సుమారు 200 ఎకరాల పంట నష్టపోయినట్లు చెప్పారు. పంట నష్టం గురించి వ్యవసాయశాఖ అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
ఈ సందర్భంగా మాట్లాడిన వివెక్ వెంకటస్వామి.. ప్రతీ సంవత్సరం ఇక్కడ రైతులు కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంట నష్టపోతున్నారు.. చెన్నూరు నియోజకవర్గంలో పంట నష్టంపై మంత్రి ఉత్తమ్ కుమార్ తో చర్చించాం. ఇక్కడ బ్యాక్ వాటర్ రాకుండా కరకట్టలు నిర్మించాలని కోరా. గత సంవత్సరం ఇక్కడ రైతులకు పంట నష్ట పరిహారం ఇప్పించా. ఈ సారి కూడా పంట నష్ట పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం.
కావాలనే బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ధర్నాలు చేయడం కాదు.. కేసీఆర్ ఇంటి ముందు ధర్నాలు చేయాలి. కేసీఆర్ హయాంలో ఇంజనీర్లు లంచాలు తీసుకొని ధనవంతులుగా మారారు. ఇటీవలే ఐటీ రైడ్ లు జరగడంతో కాళేశ్వరం ఇంజనీర్ల బాగోతాలు బయట పడ్డాయి. అని విమర్శించారు మంత్రి వివేక్ .