సిద్దిపేట సభలో‘ఇందిరమ్మ బీమా’ నవంబర్19న ప్రారంభం : మంత్రి వివేక్ వెంకటస్వామి 

సిద్దిపేట సభలో‘ఇందిరమ్మ బీమా’ నవంబర్19న ప్రారంభం : మంత్రి వివేక్ వెంకటస్వామి 
  • సభాస్థలి కోసం మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్‌‌తో కలిసి పలు ప్రాంతాల పరిశీలన  

సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సిద్దిపేటలో సీఎం రేవంత్​రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు శక్తి, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌‌చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ఈ వేదికపై సీఎం  ప్రారంభిస్తారని చెప్పారు.

ఈనెల19న  సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం సభాస్థలి కోసం సిద్దిపేటలో పలు ప్రాంతాలను విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులతో కలసి మంత్రులు పరిశీలించారు. ఈ సందర్బంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. నవంబర్ 19న సిద్దిపేట సభ వేదికగా సీఎం రూ.5 లక్షల  ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించి.. చిలుక పచ్చ రంగు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తారని తెలిపారు.

సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నట్టు, 20 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌‌ ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న వడ్లకు రూ.5 వందల బోనస్, రుణ మాఫీ, రైతు భరోసా, ఉద్యోగ నియామకాలు, పెండింగ్ ప్రాజెక్టు నిర్మాణం లాంటి కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామని వెల్లడించారు. సిద్దిపేటలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభకు ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. 

సీసీ రోడ్లకు శంకుస్థాపన

మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి వివేక్ సిద్దిపేటలో వివిధ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. అనంతరం కొండ భూదేవి గార్డెన్స్‌‌లో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట మున్సిపాలిటీ, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు, నారాయణరావుపేట, నంగునూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు రెండో విడత 1,121 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకంతో ప్రతి లబ్ధిదారుడికి రూ.1200 వరకు లబ్ధి చేకురుతుందని వివేక్ వెంకటస్వామి అన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ.9వేల కోట్లు చెల్లించిందని వెల్లడించారు. నిరుపేదలకు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 5,500,  రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఇండ్లు ఇచ్చామని, రెండేండ్లలో మరో రెండు లక్షల  ఇండ్లు మంజూరు చేస్తామని వివరించారు. కరోనా సమయంలో సహకరించినట్టుగానే ఎల్‌‌నినోను ఎదుర్కోవడానికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపెల్లి చంద్రం, సీపీ రష్మీ పెరుమాళ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌‌చార్జులు తూంకుట నర్సారెడ్డి, పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ చైర్మన్ పూజల గోపికృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్‌‌లు దేవులపల్లి యాదగిరి, మీసం మహేందర్ పాల్గొన్నారు.