సిద్దిపేటలో హరీశ్​రావు, సూర్యాపేటలో జగదీశ్​రెడ్డి, కరీంనగర్​లో గంగులకు నిరసన సెగ

సిద్దిపేటలో హరీశ్​రావు, సూర్యాపేటలో జగదీశ్​రెడ్డి, కరీంనగర్​లో గంగులకు నిరసన సెగ
  •     సీబీఐ లేదా సిట్టింగ్​ జడ్జితో విచారణకు ఏబీవీపీ డిమాండ్​
  •     అరెస్ట్​ చేసిన పోలీసులు

ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గ్రూప్స్​ పేపర్ ​లీకేజీని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలకు దిగారు. పలుచోట్ల మంత్రుల క్యాంప్​ఆఫీసులను ముట్టడించారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్​రావు, సూర్యాపేటలో మినిస్టర్​ జగదీశ్​రెడ్డి క్యాంపు ఆఫీసులతో పాటు, కరీంనగర్​లో మంత్రి గంగుల ఇంటిని ముట్టడించారు. ఈ క్రమంలో మంత్రి గంగుల ఇంట్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థినులతో పోలీసులు వ్యవహరించిన తీరు కొంత వివాదాస్పదమైంది.   


సిద్దిపేట రూరల్/సూర్యాపేట/ కరీంనగర్​, వెలుగు:  టీఎస్ పీఎస్ సీ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్​చేస్తూ సిద్దిపేటలోని మంత్రి హరీశ్ రావు క్యాంపు ఆఫీసును ఏబీవీపీ ముట్టడించింది. ఏబీవీపీ ఉమ్మడి మెదక్ జిల్లా విభాగ్ కన్వీనర్​శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు ఇంతవరకు లీకేజీ ఘటనపై స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులు చేయిస్తున్న మంత్రులు..ఎందుకు టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్​లను విచారించట్లేదని మండిపడ్డారు.

తర్వాత ఏబీవీపీ నాయకులు క్యాంపు ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జిల్లా కన్వీనర్ వివేక్, మెదక్ జిల్లా కన్వీనర్​శశికాంత్, సంగారెడ్డి జిల్లా కన్వీనర్ ఆకాశ్, హుస్నాబాద్ నగర కార్యదర్శి ఆదిత్య, లక్ష్మీపతి, సంజయ్, రాకేశ్, ప్రశాంత్, ప్రసాద్ పాల్గొన్నారు.

ప్రగతిభవన్​ ముట్టడిస్తాం

 సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీశ్​రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఏబీవీవీ నాయకులు ముట్టడించేందకు యత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పీఎస్​కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ గ్రూప్స్​పేపర్​లీకేజీలపై  సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. పేపర్​లీకై ఇప్పటికే  15 రోజులు దాటినా మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

దాదాపు 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్లపాలు చేసి వారి జీవితాలను అంధకారం లోకి నెట్టారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రగతి భవన్  ముట్టడించడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఏబీవీపీ సూర్యాపేట జిల్లా కన్వీనర్ కీర్తి శివ కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఛత్రపతి చౌహాన్, నల్గొండ విభాగ్ కన్వీనర్ మణికంఠ, నల్గొండ జిల్లా కన్వీనర్ సంపత్, యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అభినవ్, చింతకాయల గురునాథ్ పాల్గొన్నారు.

సిట్​పై మాకు నమ్మకం లేదు

ఏబీవీపీ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. లీకేజీ కి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్యాల రాకేశ్ మాట్లాడుతూ టీఎస్ పీఎస్సీ చైర్మన్ ను వెంటనే తొలగించి హైకోర్టు జడ్జితో లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తుపై తెలంగాణ యువతకు ఎలాంటి నమ్మకం లేదన్నారు.

తర్వాత పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఓ కానిస్టేబుల్ ఓ లేడీ స్టూడెంట్​కాలు, చేయి పట్టుకుని లాగడం వివాదాస్పదమైంది. గేటును పట్టుకున్న ఏబీవీపీ కార్యకర్తలపై మంత్రి అనుచరుడొకరు లోపల నుంచి కర్రతో దాడి చేశాడు. ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ రంజిత్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ విష్ణు, నందు, వేణు, శివ, సాయి కృష్ణ, ప్రవీణ్, ప్రవలిక, దివ్య, అనూష, మమత పాల్గొన్నారు.