పర్యాటక హబ్ గా ఉమ్మడి ఖమ్మం..సమీక్ష సమావేశంలో మంత్రులు తుమ్మల, జూపల్లి

పర్యాటక హబ్ గా ఉమ్మడి ఖమ్మం..సమీక్ష సమావేశంలో మంత్రులు తుమ్మల, జూపల్లి

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్లాన్ రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.  సోమవారం సచివాలయంలో టూరిజం కార్పొరేషన్‌ ఎండీ క్రాంతి, జనరల్‌ మేనేజర్‌ ఉపేందర్‌రెడ్డితో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో వివిధ చారిత్రక ప్రాంతాలను  అభివృద్ధి చేసి టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలని, ఏకో, టెంపుల్‌ టూరిజంల అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశించారు.

  నేలకొండపల్లి వద్ద ఉన్న బౌద్ధస్థూపం, పర్ణశాల, భద్రాచలం టెంపుల్‌ ప్రాంతాల్లో  విస్తృత అభివృద్ధికి ప్రణాళికలు రచించాలన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు, కొత్తగూడెం వద్ద హరిత హోటల్‌, తల్లాడ మండలంలో కనిగిరిహిల్స్‌, వైరా రిజర్వాయర్‌, వెలుగుమట్ల అర్బన్‌ పార్కును నూతన హంగులతో పచ్చదనం, ఆధునిక వసతులు కల్పించాలని సూచించారు. ఖమ్మం ఖిల్లా వద్ద రోప్‌వే నగరానికి మణిహారంగా నిలవాలన్నారు. 

టూరిజం డెవలప్ మెంట్ చేయాలి 

ఖమ్మంలో కొత్తగా హరిత హోటల్‌లను నిర్మించేందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో టూరిజం డిపార్ట్మెంట్‌ అధికారులు, కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి టూరిజం అభివృద్ధి కోసం కార్యాచరణను రూపొందించాలని సూచించారు. వచ్చే  నెలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారన్నారని తెలిపారు.

 సీఎం పర్యటన లోపు టూరిజం డెవలప్ మెంట్ కు కృషి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఖమ్మం పట్టణ సమీపంలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వెలుగుమట్ల అర్బన్ పార్క్ అటవీ ప్రాంతంలో ఏకో టూరిజంకు సంబంధించిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కొత్తగూడెంలో ఉన్న హరిత హోటల్ ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.