
- జూబ్లీహిల్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి వివేక్
- హైదరాబాద్ డెవలప్మెంట్ రాష్ట్రానికి ఎంతో కీలకం
- ఏ సమస్య ఉన్నా నాకొచ్చి చెప్పాలని సూచన
- పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి తుమ్మల
- జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో అభివృద్ధి పనులకు భారీగా నిధులు మంజూరు చేశామని తెలిపారు. షేక్‌పేట్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి వివేక్ వెంకటస్వామి సోమవారం శంకుస్థాపన చేశారు. షేక్‌పేట్ డివిజన్లోని వినాయక్‌నగర్‌లో రూ.1.2 కోట్లు, యూసుఫ్‌గూడలోని కోటి రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను, సోమాజిగూడ డివిజన్లోని అంబేద్కర్ నగర్లో రూ.44 లక్షలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను మంత్రులు ప్రారంభించారు.
అనంతరం షేక్‌పేట్, యూసుఫ్‌గూడలో ఏర్పాటు చేసిన సభల్లో వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. ‘‘ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధి.. రాష్ట్రానికి ఎంతో కీలకం. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు ముగ్గురు మంత్రులు కృషి చేస్తున్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా నేరుగా నాకు వచ్చి చెప్పాలి.
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. అందరికి సంక్షేమ ఫలాలు అందుతాయి. షేక్‌పేట్‌లోని అన్ని సమస్యలను పరిష్కరిస్తాం. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. గత పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది. సన్న బియ్యం పంపిణీ చేస్తున్నది’’అని వివేక్ అన్నారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగాతీర్చిదిద్దుతాం: తుమ్మల
అభివృద్ధికి మారుపేరైన కాకా వెంకటస్వామి గురించి దేశంలోని ప్రతి ఒక్కరికి తెలుసని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి అంటే ఇక వివేక్ వెంకటస్వామి గుర్తుకు వస్తారని తెలిపారు. ‘‘హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మెట్రో ఎక్స్టెన్షన్, ట్రిపుల్ ఆర్ వంటి ప్రాజెక్టులతో పాటు రేషన్ కార్డులు, పెన్షన్ల ద్వారా పేదల సంక్షేమం కోసం మేమంతా కృషి చేస్తున్నాం. జూబ్లీహిల్స్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు.
సీఎం వద్దే మున్సిపల్ శాఖ ఉన్నది. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం’’అని తుమ్మల అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, స్థానిక కార్పొరేటర్ ఫరాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
కలిసి పని చేస్తేనే అభివృద్ధి
స్థానిక సమస్యలపై సర్వే చేస్తే నాలాలు, డ్రైనేజీ సమస్యలు వెలుగులోకి వచ్చాయని మంత్రి వివేక్ అన్నారు. ‘‘సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. సమిష్టిగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యం. రేషన్ కార్డుల ద్వారానే అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి. కరెంట్ బిల్లులు, రేషన్ కార్డులు, పెన్షన్ సంబంధిత సమస్యలను స్థానిక మహిళలు మా దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నింటినీ త్వరలో పరిష్కరిస్తాం’’అని వివేక్ అన్నారు. ఈ సందర్భంగా సోమాజిగూడ అంబేద్కర్‌నగర్‌లోని అమ్మవారి ఆలయంలో మంత్రి వివేక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.