తిరుమలలో ఉన్నారా..? మొదటి ఘాట్ రోడ్లో కనిపించిన.. ఈ అద్భుతాన్ని అస్సలు మిస్ అవ్వకండి !

తిరుమలలో ఉన్నారా..? మొదటి ఘాట్ రోడ్లో కనిపించిన.. ఈ అద్భుతాన్ని అస్సలు మిస్ అవ్వకండి !

తిరుమల: శేషాచలం కొండల్లో కొలువై ఉన్న తిరుమల పుణ్య క్షేత్రం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు ప్రకృతి సౌందర్యానికీ పెట్టింది పేరు. శేషాచలం అటవీ ప్రాంతంలో పచ్చటి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణం భక్తులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఆ దేవదేవుడి ఆనవాళ్లు తిరుమలలో అణువణువునా ఏదో ఒక రూపంలో సాక్ష్యాత్కరిస్తుంటాయి.

పెద్ద పెద్ద బండరాళ్లపై ఉన్న ముద్రలు కేవలం ముద్రలు మాత్రమే కావని, అవి ప్రకృతి దాచుకున్న జీవ చరిత్ర పుటలని చరిత్రకారులు అంటున్నారు. రెండవ ఘాట్ రోడ్డు చివరి మలుపు దగ్గర సహజ శిలా వేంకటేశ్వరస్వామి ప్రతి రూపం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.

తిరుమలకు చేరుకునే భక్తులు ఎత్తైన కొండపై ఉన్న సహజ శిలా మూర్తిని స్మరించుకుంటారు. అలాగే మొదటి ఘాట్ రోడ్డులో ఎత్తైన కొండమీద సహజ శిల గరుడ ప్రతి రూపం మనకు కనిపిస్తుంది. తిరుగు ప్రయాణంలో భక్తులు తప్పనిసరిగా ఈ గరుడ ప్రతి రూపాన్ని దర్శించుకుంటారు. ఇక తాజాగా మరో అద్భుతం వెలుగు చూసింది. మొదటి ఘాట్ రోడ్డులో వినాయకస్వామి గుడి పైభాగంలో కొండపై శ్రీవారి కిరీటం, ముక్కు, కన్ను పోలిన ప్రతి రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చాలా మంది భక్తులు శ్రీవారి ఆకారమే అంటూ భక్తిని చాటుకుంటున్నారు.  ప్రకృతి మన చరిత్రను రాళ్లపై చెక్కి, తరతరాలకూ చెప్పాలనుకుంటోందని చెబుతున్నారు. ప్రకృతి ఎంత శక్తివంతమైందో, ఒక ముద్రను శతాబ్దాల చరిత్రగా మార్చగలదో ఇది మరోసారి మనకు గుర్తు చేస్తుందని చరిత్రకారులు అంటున్నారు.