అప్పుల బాధతో మిర్చి రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో మిర్చి రైతు ఆత్మహత్య

మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు: జయ శంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో అప్పుల బాధతో మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.  సుబ్బక్కపల్లికి చెందిన రవీందర్ రావు(52) నిరుడు  కొంత భూమి కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి సాగుచేసి పెట్టుబడి కోసం అప్పు చేశాడు. దిగుబడి రాక నష్టపోయాడు. ఈసారి తనకున్న రెండున్నర ఎకరాల్లో మళ్లీ మిర్చి వేశాడు. వాతావరణం అనుకూలించక, తెగుళ్లు సోకి పంట పూర్తిగా దెబ్బతింది. అప్పులు రూ.20 లక్షలకు చేరాయి. వాటిని ఎట్ల తీర్చాలనే మనస్తాపంతో మంగళవారం రాత్రి చేను వద్ద పురుగుమందు తాగి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. వాళ్లు అక్కడి వెళ్లేసరికి చనిపోయాడు. 
 

యాదాద్రి జిల్లాలో మరో రైతు..
వలిగొండ, వెలుగు: అప్పుల బాధతో ఓ రైతు‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ముద్దాపురం గ్రామంలో బుధవారం జరిగింది. ముద్దాపురం గ్రామానికి చెందిన బడక నరసింహ (43) తనకున్న 18 ఎకరాల పొలంలో నాలుగేండ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. పలు కారణాలతో పంట దెబ్బతినడంతో భారీగా నష్టపోయాడు. దీంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. అవి ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై బుధవారం వ్యవసాయ బావి వద్ద ఉన్న కొట్టంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడి స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్‌‌ గౌడ్‌ తెలిపారు.