ఆరంభం అదిరేలా .. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం

ఆరంభం అదిరేలా .. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం
  • తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు
  • 1,500 మంది కళాకారులతో నృత్య ప్రదర్శన
  • అన్ని వివరాలతో​ వెబ్​సైట్ ప్రారంభం​

హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధమైంది. ‘తెలంగాణ.. జరూర్ ఆనా..’ నినాదంతో  తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 10న గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న మిస్​వరల్డ్​ ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. తొలిరోజు 1,500 మంది కళాకారులతో జానపద కళారీతులైన ఒగ్గుడోలు, డప్పు, కొమ్ముకోయ, గుస్సాడీ, కోలాటంతో పాటు కూచిపూడి, పేరిణి తదితర సంప్రదాయ నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్​గా నిలవనున్నాయి.

దాదాపు 116 దేశాల నుంచి పోటీదారులు, వారి వెంట మీడియా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఒక్కొక్కరుగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. తెలంగాణ టూరిజం ప్రమోషన్​లో భాగంగా 22 ప్రాంతాలకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను తీసుకెళ్లనున్నారు. ఆయా ప్రాంతాలను బట్టి అక్కడి కట్టు, బొట్టు, సంప్రదాయాలు, కళారీతులను హైలెట్​చేయాలని నిర్ణయించారు. రామప్ప ఆలయ సందర్శనకు వెళ్లినప్పుడు బతుకమ్మ, బోనాలు, కోలాటంతోపాటు పేరిణి  కళాకారులు నృత్యాలను ప్రదర్శించనున్నారు. అలాగే, పోచంపల్లి వెళ్లినప్పుడు ఇక్కత్​వస్త్రాలతో ర్యాంప్ వాక్ నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఈ  కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు.   

గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి 

మిస్​వరల్డ్​ప్రారంభ వేడుకల కోసం గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఆయా శాఖల అధికారులతో కలిసి సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. స్వాగత తోరణాలను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మామిడి, అరటి ఆకులు, పూలతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. జానపద కళారీతులైన గుస్సాడీ, ఒగ్గుడోలు ప్రదర్శనలతో పాటు పేరిణి, కూచిపూడి, భరతనాట్యం,  కథక్​లాంటి భారతీయ సంప్రదాయ నృత్యాలూ ప్రదర్శించాలన్నారు.

  అలాగే తెలంగాణ  హ్యాండ్ క్రాప్ట్స్, ముఖ్యంగా సిల్వర్​ ఫిలిగ్రీ, చేర్యాల నకిశీలకూ చోటు కల్పించాలని ఆదేశించారు. ఈ నెల 10వ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని.. ఎక్కడా నిర్లక్ష్యం చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దగ్గరుండి పనులు పూర్తిచేయించాలని భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి మామిడి హరికృష్ణను ఆదేశించారు.

మిస్ ​వరల్డ్​ పోటీల కోసం ప్రత్యేక వెబ్​ సైట్ 

మిస్​ వరల్డ్​ పోటీలను వీవీఐపీలతోపాటు సామాన్యులు కూడా తిలకించేలా ప్రత్యేక వెబ్​ సైట్​ను అందుబాటులోకి తెచ్చారు. ఈవెంట్స్‌‌కు ఉచిత ఎంట్రీ పాస్‌‌లను ఆన్‌‌లైన్ సెలక్షన్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయనున్నట్టు టూరిజం ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేశ్​రంజన్​ పేర్కొన్నారు. ‘‘ఆసక్తిగల వ్యక్తులు తెలంగాణ టూరిజం వెబ్‌‌సైట్ https://tourism.telangana.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ ఆప్షన్​వస్తుంది. దాన్ని ఓపెన్​ చేసి ఎంపిక కోసం క్యూరేటెడ్ ఎంగేజ్‌‌మెంట్ యాక్టివిటీలో పాల్గొనాలి. ఎంపికైన వారి మెయిల్ ఐడీకి కన్ఫర్మేషన్ వస్తుంది. ఇది వారి ఉచిత ఎంట్రీ పాస్‌‌గా పరిగణిస్తారు’’ అని ఆయన తెలిపారు.