అదృశ్యమైన తల్లీకూతురు చనిపోయారు

అదృశ్యమైన తల్లీకూతురు చనిపోయారు

రెండు రోజుల కింద తల్లీకూతుళ్ల అదృశ్యం
పత్తి చేనులో.. మృతదేహాలు

కొండాపూర్‌, వెలుగురెండు రోజుల క్రితం అదృశ్యమైన తల్లీకూతుళ్లు గ్రామ శివారులో చేనులో శవమై కనిపించారు. కొండాపూర్‌ ఎస్సై రాజు వివరాల ప్రకారం..  సంగారెడ్డి జిల్లా సైదాపూర్‌ గ్రామానికి చెందిన బాలయ్యకు ఇద్దరు భార్యలు. బాలయ్య తన మొదటి భార్యతో ఉంటుండగా రెండో భార్య జయశీల(30) తన కూతురు దుర్గమ్మ(4)తో అదే గ్రామంలో  అద్దె ఇంట్లో ఉంటోంది. ఈ నెల 23న సోమవారం జయశీల కూతురితో కలిసి బయటకు వెళ్లింది. అప్పటి నుంచి కనిపించలేదు. బుధవారం గ్రామ శివారులోని పత్తి చేనులో తల్లీకూతుళ్ల మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

విషయం తెలిసి బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున్న అక్కడకు చేరుకున్నారు. భర్త బాలయ్యే వారిని హత్య చేశాడని ఆరోపించారు. బాలయ్యను సంఘటన స్థలానికి తీసుకొచ్చి తమకు అప్పజెప్పేవరకు శవాలను అక్కడి నుంచి  తీయడానికి వీలు లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతికి కారకులైన వారిని అరెస్ట్‌ చేసి శిక్ష పడేలా చూస్తామని సీఐ శివలింగం సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి లచ్చయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.